Fri Nov 22 2024 15:05:33 GMT+0000 (Coordinated Universal Time)
దేవుడికి అలా మొక్కుకుంటున్నారన్న మాట
ఏపీసీపీఐ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని పార్టీకి శాసనసభలోకి ప్రాతినిధ్యం కల్పించాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది
పాపం.. నారాయణ.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పార్టీకి శాసనసభలోకి ప్రాతినిధ్యం కల్పించాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక సిద్ధాంతం లేదు. పాడు లేదు. జగన్ తన కేసుల కోసం ఢిల్లీలో మోదీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారంటూ విమర్శలు చేసే నారాయణ చంద్రబాబు విషయంలో మాత్రం నోరు మెదపరు. చంద్రబాబు బహిరంగంగానే మోదీ మద్దతును కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు చంద్రబాబు తన అవసరంగా భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అండలేకుండా ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని భావించిన చంద్రబాబు ఆ దిశగానే చివరి వరకూ ప్రయత్నం చేస్తారన్నది అందరికీ తెలిసిందే.
బీజేపీతో పొత్తు కోసం...
కానీ పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేసే నారాయణకు మాత్రం చంద్రబాబు వ్యవహార శైలిపై మాత్రం ఎలాంటి అనుమానం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. నిన్ననే చంద్రబాబు రిపబ్లిక్ టీవీలో ఇంటర్వ్యూ చూసిన వారికి ఎవరికైనా చంద్రబాబు మోదీతో మిత్రత్వాన్ని మరోసారి కోరుకుంటున్నారని అర్థమవుతుంది. కానీ నారాయణకు మాత్రం అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి జగన్ మాత్రమే విమర్శిస్తూ చంద్రబాబు విషయంలో మాత్రం మౌనంగా ఉంటుండటం సీపీపీ అగ్రనేత నిస్సహాయతకు నిదర్శనంగా చెప్పాల్సి ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ప్రయత్నాలు ఫలిస్తే...
రేపు అంతా కలసి వస్తే చంద్రబాబుతో పొత్తుతోనే ఎన్నికలకు వెళతారు. అప్పుడు నారాయణ ఏం చేస్తారు? చంద్రబాబుతో చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన సీపీఐ నేతలకు అప్పుడు అసలు విలువ ఉంటుందా? అన్న ప్రశ్నకు మాత్రం వారి వద్ద సమాధానం లేదు. చంద్రబాబును బీజేపీ దగ్గరకు రానివ్వదనే ధైర్యంతోనే సీపీఐ నేతలు ఇప్పటి వరకూ ముందుకు సాగుతున్నారు. కానీ చంద్రబాబు రాజకీయంగా రాటుదేలిన నేత. ఏ మార్గంలోనైనా వెళ్లి బీజేపీతో చేతులు కలిపితే అప్పుడు ఎర్రసైన్యం ఏం చేస్తుంది? కొద్దిలో గొప్ప సీపీఎం నయం. తనంతట తాను కార్యక్రమాలను రూపొందించుకుని ముందుకు వెళుతుంది. తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ తో కలసి వెళ్లడానికి వామపక్షాలు నిర్ణయించుకున్నాయి. అందులో ఎలాంటి తప్పులేదు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కానీ ఏపీ పాలిటిక్స్ మాత్రం అలా లేవు. చివరి నిమిషంలో ప్రధాన పార్టీలన్నీ బీజేపీ మద్దతు కోరే పరిస్థితి ఉంది. ఈ చిన్న విషయం అందరికీ తెలిసినా సీపీఐ నేతలకు మాత్రం తెలియడం లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
తొలి నుంచి టీడీపీతోనే..
కానీ సీపీఐ మాత్రం తొలి నుంచి అంటకాగుతూనే ఉంది. బీజేపీ చంద్రబాబును కలుపోకుంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ కలుపుకుంటే మాత్రం చివరకు సీపీఐకు మిగిలేది ఏదీ ఉండదు. ఒంటరిగా పోటీ చేయాలి. ఒంటరిగా పోటీ చేసినా ఒక్క స్థానంలో గెలిచే అవకాశాలు లేవు. గత దశాబ్దకాలంగా వామపక్షాలకు ఏపీ శాసనసభలో స్థానం లేకుండా పోయింది. కనీసం ఈసారైనా టీడీపీతో పొత్తు పెట్టుకుని ఒకటి, రెండు స్థానాలను గెలుచుకోవాలని భావిస్తుంది. పెద్దగా నమ్మని.. నమ్మకం లేని దేవుడిని బీజేపీతో బాబు కలవవద్దని ప్రార్ధించాల్సిన పరిస్థితి నెలకొంది. రహస్యంగా భగవంతుడిని నారాయణ అలా ప్రార్ధించి..ఆ ప్రార్థనలు దేవుడు వినాలని సీపీఐ నేతలు కోరుకుంటున్నట్టే ఏపీలో సీపీఐ నేతల తీరు ఉంది.
Next Story