Mon Dec 23 2024 12:45:27 GMT+0000 (Coordinated Universal Time)
ఈ ఫొటోపై రగడ ఇప్పట్లో ఆగదా?
టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలసి మాట్లాడుకోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి
అవును వారిద్దరూ బద్ధ శత్రవులు. ఒకరినొకరు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకునే వారు. ట్విట్టర్ లోనూ, మైకు ఎదుట ఎక్కడ పడితే అక్కడ విమర్శలు చేసుకోవడమే ఇద్దరికీ పని. ఒకరు టీడీపీ అధినేత చంద్రబాబు కాగా, మరొకరు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. జగన్ ను ఎంతగా ధ్వేషిస్తారో టీడీపీ నేతలు విజయసాయిరెడ్డిని కూడా అదేస్థాయిలో దారుణంగా ట్రోల్ చేస్తారు. ఇది ఇప్పటి నుంచి కాదు 2014 ఎన్నికల నాటి నుంచి జరగుతున్నదే. కొత్త విషయమేమీ కాదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది అందరికీ తెలిసిన విషయమే.
ఏ 2 అంటూ...
విజయసాయిరెడ్డిని చంద్రబాబు ఏ2 అని తరచూ విమర్శలు చేస్తుంటారు. విశాఖపట్నం ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఆయన భూకుంభకోణాలకు చేశారని సాయిరెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఇక చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్న లాంటి నేతలయితే విజయసాయిరెడ్డిపై ఒంటికాలు మీద లేస్తారు. ఇక లోకేష్ సరేసరి. వైసీపీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డిని విమర్శిస్తే జగన్ ను విమర్శించినట్లే భావిస్తారు. అందుకే విజయసాయిరెడ్డిని టీడీపీ నేతలు ఎప్పుడూ టార్గెట్ చేస్తారు. అదే స్థాయిలో విజయసాయిరెడ్డితో పాటు వైసీపీ నేతలు కూడా చంద్రబాబును, లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తుంటారు. విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబును అదేస్థాయిలో విమర్శిస్తారు. లోకేష్ ను కూడా వ్యక్తిగతంగా విమర్శిస్తారు. చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు కూడా సాయిరెడ్డి తరచూ చేస్తుంటారు.
సోషల్ మీడియాలో ఫైర్...
కానీ కొద్దిరోజుల క్రితం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు కలసి కూర్చుని మాట్లాడుకోవడంపై రెండు పార్టీల్లోని కార్యకర్తలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెబుతున్నారు. వైసీపీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డి చంద్రబాబుతో మాట్లాడమేంటి? ఆయనతో కలసి మీడియాతో మాట్లాడటమేంటి? ఆయనను కారు వద్ద వరకూ వచ్చి సాగనంపడమేంటి? అని వైసీపీ సోషల్ మీడియాలో సాయిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. సాయిరెడ్డి ఆరోజు వ్యవహరించిన తీరుపై అభ్యంతరం తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. అదే స్థాయిలో టీడీపీ అభిమానులు సయితం చంద్రబాబును తప్పుపడుతున్నారు. నెంబర్ 2 అని విమర్శించి ఆయనతో మంతనాలు ఏంటంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
తారకరత్న భౌతికకాయం వద్ద...
నిజానికి ఒక విషాదఘటనలో వారిద్దరూ కలుసుకున్నారు. తారకరత్న విజయసాయిరెడ్డి మరదలి కూతురు భర్త. అందుకోసమే తారకరత్న విషయంలో విజయసాయిరెడ్డి అంత చొరవ తీసుకున్నారు. అలాగే చంద్రబాబు కూడా తారకరత్న తన భార్య తరుపున బంధువు. అల్లుడి వరస అవుతాడు. అలాంటి చోట ఇద్దరూ కలసి కూర్చుని కుటుంబ విషయాలపై మాట్లాడుకుంటే తప్పు పట్టడమేంటి? అని కొందరు ప్రశ్నిస్తున్నా రెండు పార్టీల అభిమానులు మాత్రం వీరిద్దరు కలసి కూర్చుని మాట్లాడుకోవడం జీర్ణించుకోలేకపోతున్నారు. నెగిటివ్ గా పోస్టులు పెడుతున్నారు. విజయసాయిరెడ్డికి తెలియకుండానే అనుబంధ సంఘాలను భర్తీ చేయడం కూడా ఆయనపై హైకమాండ్ ఆగ్రహంగా ఉందంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద ఈ ఫొటో విషాద సమయంలో బయటకు వచ్చినా సోషల్ మీడియాలో రగడ మాత్రం ఇప్పట్లో ఆగేలా లేదు.
Next Story