Mon Dec 23 2024 06:14:38 GMT+0000 (Coordinated Universal Time)
ఏం రాజకీయమయ్యా జగన్.. శభాష్?
వైఎస్ జగన్ చేపడుతున్న నియామకాలు, ఇస్తున్న పదవులు పార్టీకి భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తుతాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి
ఏ రాజకీయ పార్టీలకు వైసీపీ భిన్నం కాదు. తొలి నుంచి కష్టపడి పనిచేసిన వారికి పదవులు దొరకవు. ఇన్ స్టంట్ నేతలనే అందలం ఎక్కించడంలో జగన్ కూడా రికార్డు నెలకొల్పుతున్నారు. పన్నెండేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని కాదని, భవిష్యత్ రాజకీయాల కోసం, సామాజికపరంగా ఓట్లు తెచ్చుకోవడం కోసమే జగన్ పాకులాడుతున్నారన్న విమర్శలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. జగన్ పార్టీలో చేరితే పదవి గ్యారంటీ అని ప్రత్యర్థి పార్టీలకు సంకేతం పంపుతున్నారా? అని అనిపిస్తుంది. ఈ సంకేతాలు ఇతర పార్టీల నేతలను ఆకర్షించవచ్చేమో గాని ఏళ్లుగా పార్టీ జెండా పట్టుకున్న వారిలో అసంతృప్తి, అసహనం పెరగడం అంతే ఖాయమని చెప్పక తప్పదు.
పార్టీలోకి వచ్చిన వారికి...
ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు తీసుకుంటే అప్పటికప్పుడు చేరే వాళ్లకే జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని పార్టీలో విమర్శలు వినిపిస్తున్నాయి. 2014లో పార్టీ అధికారంలోకి రాకపోయినా అండగా నిలబడిన వారికి, 2019లో తమకు టిక్కెట్ రాకపోయినా సహనం పాటించి పార్టీలోనే కొనసాగుతున్న వారిని పక్కన పెట్టి అప్పటికప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే నేతలకు ప్రయారిటీ ఇచ్చినందున ఓట్లు ఎంత మేర వచ్చి పడతాయో తెలియదు కాని.. ఉన్న ఓట్లు పోయే అవకాశముందన్న ఆందోళన పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలోనే విమర్శలకు తావిచ్చేలా ఉన్నాయి.
పార్టీకోసం కష్టపడిన...
జగన్ ఆషామాషీగా అధికారంలోకి రాలేదు. ఆయన సొంత కృషి కొంత ఉంటే, నేతలు కార్యకర్తలు పట్టుదలతో పనిచేయడం వల్లనే అందలం ఎక్కారు. రాజ్యసభను తీసుకుంటే కొత్తగా పార్టీలో చేరిన వెంటనే బీద మస్తాన్ రావుకు పదవి ఇచ్చేశారు. తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇవ్వడం కూడా అంతే చర్చనీయాంశమైంది. ఇక తాజాగా ఎమ్మెల్సీల భర్తీలోనూ జగన్ అదే వైఖరిని అవలంబిస్తున్నారంటున్నారు. ినిన్న గాక మొన్న పార్టీ కండువా కప్పుకున్న జయమంగళ వెంకట రమణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటున్నారు. సామాజికవర్గం కోసమే ఆయన ఆ పదవి జయమంగళ వెంకట రమణకు ఇస్తారంటున్నారు.
ఇలా చేరిన వెంటనే...
అలాగే పార్టీలో కొంతకాలం క్రితం చేరిన కుడిపూడి సూర్యనారాయణ పేరు కూడా ఖరారయిందంటున్నారు. శెట్టిబలిజలను ఆకట్టుకునేందుకే ఆ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. కోలా గురువులు కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన వారే. దీంతో తొలి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కిల్లి కృపారాణి వంటి నేతలను పట్టించుకోకుండా జగన్ సామాజికవర్గం పేరు చెప్పి అసలైన నేతలను పక్కన పెడుతున్నారంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు పార్టీలో చేరి పార్టీ కోసం కృషి చేసిన వారిని జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్లకు, జగన్ ను ముఖ్యమంత్రిగా గెలిపించడం కోసం శ్రమించిన వాళ్లకు పదవులు దక్కకపోవడంపై అసంతృప్తి తలెత్తే అవకాశముంది. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం కనిపిస్తుందనే వారు ఎక్కువగా ఉన్నారు. ఒకవేళ 2024లో వైసీపీ అధికారంలోకి రాకపోతే ఈ పదవులు పొందిన వారు ఎవరూ పార్టీలో ఉండే ఛాన్స్ లేదని, వారికి పార్టీ పట్ల గాని, జగన్ పట్ల గాని ప్రేమ ఎందుకుంటుందని ప్రశ్నిస్తున్నారు.
Next Story