Thu Dec 19 2024 12:43:06 GMT+0000 (Coordinated Universal Time)
చిన్నమ్మ అడ్డంకిగా మారిందా?
దగ్గుబాటి పురంద్రీశ్వరి ఆమె కుమారుడి రాజకీయ భవిష్యత్ కు కూడా అడ్డంకిగా మారారు. వాళ్లు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి
దగ్గుబాటి పురంద్రీశ్వరి ఆమె కుమారుడి రాజకీయ భవిష్యత్ కు కూడా అడ్డంకిగా మారారు. వాళ్లు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి. బీజేపీలో పురంద్రీశ్వరి క్రియాశీలకంగా ఉన్నారు. కొంత వెయిట్ చేస్తే కేంద్ర మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయి. అయితే ఎప్పుడు? ఎలా? అనేది చెప్పలేం. వచ్చే ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే సులువుగా కేంద్రమంత్రి పదవి దక్కుతుందన్న నమ్మకంతో చిన్నమ్మ ఉన్నారు. లేకుంటే రాజ్యసభకు ఎంపిక చేసైనా తనకు బీజేపీ కేంద్ర నాయకత్వం కేంద్ర మంత్రిగా బాధ్యతలను అప్పగిస్తుందన్న విశ్వాసంతో పనిచేస్తున్నారు.
దగ్గుబాటి మాత్రం...
అయితే ఇదే సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్లే. ఆయన గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు, పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక రాజకీయాల్లోకి ఆయన వచ్చే అవకాశం లేనట్లే. పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకున్నట్లేనని దగ్గుబాటి వెంకటేశ్వరరావు సన్నిహితులు చెబుతున్నారు. అయితే దగ్గుబాటి తన తనయుడి రాజకీయ భవిష్యత్ పైనే బెంగపెట్టుకున్నారు. తన కుమారుడిని ఎమ్మెల్యేగా చూడాలని ఆయన కలలు కంటున్నారు.
చంద్రబాబుతో ...
ఇటీవల చంద్రబాబుతో కొంత సఖ్యత కుదిరింది. తెలుగుదేశం పార్టీ నుంచి హితేష్ ను రాజకీయ అరంగేట్రం చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆలోచన చేస్తున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా హితేష్ ను టీడీపీలోకి తీసుకువచ్చి కుటుంబమంతా ఒక్కటేనని చాటాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల దగ్గుబాటి అనారోగ్యానికి గురయినప్పుడు కూడా చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వచ్చారు. దీంతో రెండు కుటుంబాల మధ్య సఖ్యత కుదిరింది. ఈ నేపథ్యంలో హితేష్ ను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయించాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు.
తల్లికి పదవి దక్కాలంటే...
అయితే బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరేట్లు లేదు. జనసేనతో పొత్తు కుదిరినా టీడీపీతో కలసి నడిచేందుకు బీజేపీ మాత్రం సిద్ధంగా లేనట్లే కనిపిస్తుంది. టీడీపీతో మరోసారి పొత్తు పెట్టుకుని తమ పార్టీని బలహీనం చేసుకోవాలన్న యోచనలో ఆ పార్టీ కేంద్ర నాయకత్వం లేనట్లేకనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో పురంద్రీశ్వరి బీజేపీలో క్రియాశీలకంగా ఉండాలంటే హితేష్ ను టీడీపీ నుంచి బరిలోకి దింపడం కరెక్ట్ కాదేమోనన్న ఆలోచనలో ఉన్నారు. హితేష్ కూడా తల్లికి ఈ సారి అవకాశం ఇవ్వాలన్న యోచనలో ఉన్నారని చెబుతున్నారు. కుటుంబంలో హితేష్ పోటీపై పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. అయితే చిన్నమ్మ పదవికి హితేష్ అడ్డంకి అవుతారా? హితేష్ రాజకీయ ప్రవేశానికి తల్లి పురంద్రీశ్వరి అవరోధంగా మారుతుందా? అన్నది భవిష్యత్ లో తేలాల్సి ఉంది.
Next Story