Sun Dec 22 2024 01:39:20 GMT+0000 (Coordinated Universal Time)
వారసుడి కోసం దిగిరాబోతున్నారా?
ఈసారి హితేశ్ ను ఎమ్మెల్యేను చేయాలన్న ఆకాంక్ష దగ్గుబాటి వెంకటేశ్వరరావులో కన్పిస్తుంది.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు. పరిచయం అక్కర లేని పేరు. 1980 దశకంలో ఆయన ఏపీ రాజకీయాలను శాసించారు. తన మామ పెట్టిన తెలుగుదేశం పార్టీలో కీలకపాత్ర పోషించారు. చంద్రబాబు కంటే ముందే ఆయన పార్టీలో చేరి టీడీపీ యువజన విభాగానికి పనిచేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా గెలిచి దాదాపు మూడు దశాబ్దాల పాటు రాజకీయాలను తన ఇంటి గడపకే కట్టేసుకున్నారు.
తొలి నుంచి....
అలాంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన తోడల్లుడు చంద్రబాబు చేసిన వంచనతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ ను వ్యతిరేకించినా ఆయన చేరిపోయి తోడల్లుడు చంద్రబాబుకు సవాల్ విసిరారు. తన భార్య పురంద్రీశ్వరిని కాంగ్రెస్ లో చేర్చారు. ఆమె కేంద్ర మంత్రి కూడా అయ్యారు. చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. దశాబ్దాలుగా ఒకరితో ఒకరికి మాటల్లేవు. అయితే ఇటీవల నందమూరి కుటుంబంలో ఒక వివాహ వేడుకలో చంద్రబాబు, దగ్గుబాటి ఒకరిని ఒకరు పలకరించుకున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఇద్దరు కలసిన ఫొటో టీడీపీ అభిమానులను అలరించిందనే చెప్పాలి.
గత ఎన్నికల్లోనే....
2019 ఎన్నికల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లోనే తన కుమారుడు హితేశ్ చెంచురామ్ ను పోటీ చేయించాలనుకున్నా ఆయనకు అమెరికా పౌరసత్వం ఉండటంతో అడ్డంకిగా మారింది. దీంతో ఆయనే పోటీ చేయాల్సి వచ్చింది. ఒకరకంగా అది మంచిదే అయిందనుకుంటున్నారు.
కొడుకును ఎమ్మెల్యేను....
ఈసారి హితేశ్ ను ఎమ్మెల్యేను చేయాలన్న ఆకాంక్ష దగ్గుబాటి వెంకటేశ్వరరావులో కన్పిస్తుంది. అవసరమైతే టీడీపీ నుంచి బరిలోకి దింపాలన్న యత్నంలో ఉన్నారట. ఇటీవల సంక్రాంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ మూడు రోజుల పాటు కారంచేడులోని ఆయన ఇంటిలోనే గడిపారు. పేరుకు పండగ అయినప్పటికీ హితేశ్ భవితవ్యం మీదే చర్చ జరిగినట్లు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు కూడా హితేశ్ ఎంట్రీని కాదనలేరు. పైగా ఆ కుటుంబం అండ ఉంటే తనకు మరింత లాభం. అందుకే బాలకృష్ణ ఎన్నడూ లేని విధంగా అక్క ఇంట్లో బస చేసి హితేశ్ భవితవ్యంపై చర్చించారంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story