Sun Dec 22 2024 07:25:32 GMT+0000 (Coordinated Universal Time)
వసంతకు గడ్డుకాలమేనా?
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇక్కడ దేవినేని ఉమ తిరిగి పుంజుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోంది. కొండపల్లి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికలను చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్ ను గెలిపించి కొండపల్లి ప్రాంతమే. ఈసారి రివర్స్ కావడంతో ఆయనకు రానున్న కాలంలో రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న సూచనలు అందుతున్నాయి.
కొండపల్లి మున్సిపాలిటీ...
కొండపల్లిలో అన్ని వర్గాల ఓటర్లు ఉంటారు. ముస్లింలు, వెనకబడిన వర్గాలు, ఉద్యోగులు, వీటీపీఎస్ లో పనిచేసి పదవి విరమణ చేసిన ఉద్యోగులు ఓటర్లుగా ఉన్నారు. వీరంతా ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లే చెప్పుకోవాలి. అంటే వసంత కృష్ణ ప్రసాద్ కు వచ్చే ఎన్నికలు అంత సులువుగా ఉండవు. సంక్షేమ పథకాలు ఇక్కడ డంప్ చేశారు. అయినా అవి పనిచేయలేదు. ఓటర్లు తెలుగుదేశం పార్టీ వైపు నిలిచారు.
కేశినేని నాని...
కొండపల్లిలో 29 వార్డులుండగా వైసీపీ, టీడీపీ 14 వార్డులు వచ్చాయి. ఒక స్థానంలో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా టీడీపీలో చేరిపోయారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఇక్కడ కీలకంగా మారనుంది. ఛైర్మన్ ఎంపికకు అవసరమైన బలం టీడీపీకి ఉంది. మరోవైపు పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఈ మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా చేరడానికి సంబంధిత అధికారికి లేఖ రాశారు. కేశినేని నాని ఓటు ఇక్కడ కీలకంగా మారనుంది.
ఉమ క్రమంగా....
కొండపల్లి మున్సిపాలిటీ లో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు ఈ రెండు, మూడు రోజుల్లో చోటు చేసుకున్నా నైతికంగా టీడీపీ గెలిచినట్లే. ఈ నియోజకవర్గానికి చెందిన తలశిల రఘురాంకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కొండపల్లి ఫలితంలోనైనా వసంత కృష్ణ ప్రసాద్ మేలుకోవాల్సి ఉంటుంది. దేవినేని ఉమ తన సొంత సామాజికవర్గంలో ఇప్పటి వరకూ ఉన్న వ్యతిరేకతను కూడా క్రమంగా తొలగించుకుంటున్న నేపథ్యంలో వసంతకు రానున్న కాలం గడ్డుకాలమేనని చెప్పక తప్పదు.
Next Story