Mon Apr 21 2025 20:53:57 GMT+0000 (Coordinated Universal Time)
దావోస్ పెట్టుబడులు ఎవరి వైపు.. నీకా? నాకా?
దావోస్ ప్రపంచ వాణిజ్య సదస్సు ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ జరగనుంది.

దావోస్ ప్రపంచ వాణిజ్య సదస్సు ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ జరగనుంది. అయితే ఈసారి దావోస్ సదస్సుకు ఒక ప్రత్యేకత ఉంది. మిగిలిన రాష్ట్రాల మాట అటుంచితే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల పోటీ మాత్రం విపరీతంగా ఉంది. రెండు కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వాలే. గత ఏడాది దావోస్ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లినప్పటికీ అప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ టీం వెళ్లలేదు. దీంతో పెద్దగా పోటీ గురించి చర్చకు రాలేదు. కానీ ఈసారి భిన్నమైన పరిస్థితి. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పెట్టుబడుల కోసం పోటీ పడుతున్నాయి. ఎవరు ఎక్కువ రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తారన్న దానిపై రెండు రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
పెట్టుబడుల కోసం...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సింగపూర్ పర్యటనకు తన బృందంతో కలసి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి దావోస్ పర్యటనకు ఆయన వెళ్లనున్నారు. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం 40, 232 కోట్ల మేరకు పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు ప్రకటించింది. అయితే ఈసారి అంతకు మించి రావాలి. అయితే తెలంగాణకు ఒక వరం హైదరాబాద్ నగరం. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపుతారు. అందులోనూ పోటీ తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెట్టే కంపెనీలకు రాయితీలు ప్రకటించే అవకాశాలుండటంతో రేవంత్ టీం ఏ మేరకు ఈసారి దావోస్ మీట్ లో సక్సెస్ అవుతుందన్నది చూడాల్సి ఉంది.
అనుభవం.. పరిచయాలు...
మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన బృందం కూడా ఇప్పటికే దీనిపై కసరత్తులు చేసింది. ఏపీ నుంచి కూడా ఈసారి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. అనుభవమున్న నేత చంద్రబాబు కావడం ఇక్కడ అనుకూలత. అయితే కొత్త రాజధాని అమరావతి, విశాఖపట్నం వంటి నగరాల్లో పెట్టుబడులు పెడితే ఇచ్చే రాయితీలను మరింతగా ఏపీ ప్రభుత్వం పెంచే అవకాశముందని తెలిసింది. తెలంగాణను మించి అవగాహన ఒప్పందాలు చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అదే సమయంలో తనకున్న పరిచయాలను కూడా చంద్రబాబు ఈ సందర్భంగా వినియోగించుకుని రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తెచ్చి ఉపాధి అవకాశాలు మెరుగు పర్చాలని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా దావోస్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య పోటీలో నెగ్గేదెవరు? అన్న దానిపై రాజకీయంగా కూడా చర్చ మొదలయింది.
Next Story