Mon Dec 23 2024 11:54:25 GMT+0000 (Coordinated Universal Time)
యాత్రలు వాయిదా... అసలు రీజన్ ఇదేనట
లోకేష్ పాదయాత్ర, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్ర వాయిదా పడటానికి గల కారణాలపై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ రాజకీయాలు హాట్ గానే ఉంటాయి. ఏపీ ఎన్నికలకు ఇంకా పద్దెనిమిది నెలల సమయం ఉన్నా నిత్యం పొలిటికల్ గా హీట్ గానే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని విపక్ష పార్టీలు అంచనాలు వేయడమే. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో బహిరంగంగానే చెబుతున్నారు. పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని కూడా పిలుపునిస్తూ వస్తున్నారు. కొన్నాళ్లు జమిలి ఎన్నికలు జరుగుతాయని చెప్పి పార్టీ నేతల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అది సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడం లేదు.
జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని...
దీంతో గత కొన్నాళ్ల నుంచి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం గ్యారంటీ అని చెబుతున్నారు. అందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణమని లెక్కలు వేశారు. పూర్తికాలం ఎన్నికల వరకూ వేచి చూస్తే జగన్ ఇబ్బంది పడతారని, అందుకే ముందస్తు ఎన్నికలకు వెళతారని భావించారు. మహానాడు తర్వాత కొంత హడావిడి చేశారు. జిల్లాల్లో మినీ మహానాడుల పేరుతో కొంత పార్టీకి ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. బాదుడే బాదుడు అంటూ జిల్లాలను పట్టుకుని తిరిగారు. అందుకే ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా టిక్కెట్లు ప్రకటించారు. అది కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయని భావించే. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ కొంత బలపడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జగన్ కు ఆ ఆలోచన లేదని రూఢీగా తెలుసుకున్న విపక్షాలు తమ కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నాయి.
ఎన్నికల నాటికి...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేయాలనుకున్నారు. ఈ ఏడాది చేయాలని భావించారు. అందుకు రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలో పాదయాత్రను ప్రారంభించి ఉత్తరాంధ్రలో ముగించాలని భావించారు. ఇందుకు 450 రోజుల సమయం పడుతుందని అంచనా కూడా ఉంది. అంటే ఇప్పుడు మొదలు పెడితే ఎన్నికలు వచ్చే నాటికి పాదయాత్రను ముగించే వీలుంది. కానీ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని తెలిసి లోకేష్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి (సంక్రాంతి పండగ తర్వాత) పాదయాత్ర మొదలు పెట్టాలని యోచిస్తున్నారు. దీంతో 2024 మార్చి నాటికి పాదయాత్ర ముగుస్తుంది. అంటే ఎన్నికలకు ముందు పాదయాత్రను ముగించే వీలుకలుగుతుందని ఆయన తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పవన్ బస్సు యాత్ర కూడా...
మరోవైపు పవన్ కల్యాణ్ బస్సు యాత్ర వాయిదా కూడా ఇదే కారణమని చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలకు వచ్చే అవకాశం లేదని భావించిన పవన్ కల్యాణ్ తన యాత్రను మరికొంత కాలం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి పవన్ బస్సు యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇంత ముందుగా బస్సు యాత్ర చేపట్టినా ఫలితం ఉండదని సన్నిహితులు చెప్పడంతో పాటు అనవసర ఖర్చు ముందుగానే పెట్టడం ఎందుకన్న ధోరణితోనే ఆయన బస్సు యాత్రను వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. దీంతో పాటు అక్టోబరు, నవంబరు నెలల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయని, తుపానుల సమయం కూడా కాబట్టి వాయిదా వేసుకున్నారని కూడా టీడీపీ, జనసేన పార్టీ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. జనవరి నుంచి అయితే వాతావరణ పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుందని లోకేష్ అప్పటికి వాయిదా వేసుకుంటున్నట్లు టీడీపీ లీకులు వదిలారు. పవన్ కూడా దాదాపు అదే పరిస్థితి.
Next Story