Tue Nov 05 2024 19:42:23 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ డెసిషన్.... రాంగ్... ఫ్యూచర్ లో తేలుతుందా?
జగన్ రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్ లో ఇబ్బందులు కలిగించక మానవు
జగన్ రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్ లో ఇబ్బందులు కలిగించక మానవు. ఆయన అధికారంలో ఉంటే సరే.. లేకుంటే మాత్రం ఆయన నిర్ణయాలు కొన్ని ఆయనకే రివర్స్ అవుతాయి. అందులో ముఖ్యంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఒకటి. రాజ్యసభ అభ్యర్థులుగా తెలంగాణకు చెందిన ఆర్. కృష్ణయ్య, బీదమస్తాన్ రావు, విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డిలను ఎంపిక చేశారు. ఇందులో నిరంజన్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఆయనకు అత్యంత ఆప్తులు. నమ్మకస్థులు. తొలి నుంచి జగన్ వెంట నడిచిన వారే. ఇక మరో ఇద్దరి సంగతి ఏంటన్న చర్చ జరుగుతుంది. నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పొరుగు రాష్ట్రంలో....
పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో డీఎస్ శ్రీనివాస్ ను కాంగ్రెస్ నుంచి వస్తే తీసుకుని రాజ్యసభ స్థానం కేసీఆర్ ఇచ్చారు. కానీ చివరకు ఆయన పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు. ఇటు అనర్హత వేటు వేయలేక, ఆయనపై చర్యలు తీసుకోలేక మొన్నటి వరకూ కేసీఆర్ ఇబ్బందులు పడిన విషయాన్ని ఇప్పుడు కొందరు గుర్తు చేస్తున్నారు. రాజ్యసభ స్థానాలను ఎంపిక చేసేటప్పుడు నమ్మకం, పార్టీ పట్ల విధేయత వంటివి చూడాలని చెబుతారు. ఎందుకంటే ఆరేళ్లపాటు ఉండే ఈ పదవి ముఖ్యమైనది. ఇప్పటికే జగన్ కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో తలబొప్పి కడుతుంది.
బీదకు మించిన....
ఇక కొత్తగా ఎంపికయిన నలుగురిలో ఇద్దరి పరిస్థితి భవిష్యత్ లో అనుమానించదగినదేనని అంటున్నారు. ఒకవేళ 2024లో జగన్ అధికారంలోకి రాలేకపోతే ఇద్దరు పార్టీకి వ్యతిరేకంగా మారే అవకాశమూ లేకపోలేదు. అందులో బీద మస్తాన్ రావు. మొన్నటి వరకూ టీడీపీలో ముఖ్యనేతగా కొనసాగారు. ఇప్పటికే టీడీపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారంటారు. ఆయన సోదరుడు బీద రవిచంద్ర తెలుగుదేశం పార్టీలో ముఖ్య భూమికను పోషిస్తున్నారు. అధికారంలోకి మళ్లీ జగన్ వస్తే ఈయన నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. రాలేకపోతేనే.. పార్టీకి దూరంగా ఉంటారన్నది సీనియర్ నేతలు అంగీకరిస్తున్నారు. కేవలం బీసీ కార్డు ద్వారా ఎంపిక చేస్తే అనేక మంది రాష్ట్రంలో ఉన్నారని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇవ్వాల్సిన గతి ఏం పట్టిందన్న ప్రశ్నలు కింది స్థాయి క్యాడర్ నుంచి కూడా ఎదురవుతున్నాయి.
నమ్మదగిన వ్యక్తేనా...?
ఇక రెండో వ్యక్తి ఆర్.కృష్ణయ్య. ఆయన మరో సీతయ్య. ఎవరి మాట వినరు. రేపు ఎన్నికల్లో బీసీల తరుపున చంద్రబాబును దూషించడానికి పని చేస్తారు. భవిష్యత్ లో ఈయన ఎటు వైపు టర్న్ తీసుకుంటారో ఎవరికీ తెలియదు. తెలంగాణ కు చెందిన వ్యక్తి. తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కేంద్రానికి వ్యతిరేకంగా పెద్దల సభలో తన గళం విప్పుతారు. ఆర్. కృష్ణయ్య కూడా టీడీపీ, కాంగ్రెస్ ల నుంచి వచ్చిన వారు. ఏపీ లోని బీసీలను కదిలించే శక్తి ఆయనకు ఉందా? అన్నది కూడా అనుమానమే. ఈయనపై తాజాగా తెలంగాణలో భూ కబ్జా కేసు నమోదయింది. రెండు రాజ్యసభ స్థానాలను జగన్ వేస్ట్ చేశారని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. భవిష్యత్ లో జగన్ కు ఈ ఇద్దరు తలనొప్పిగా మారతారన్న కామెంట్స్ బలంగా విన్పిస్తున్నాయి.
Next Story