Mon Dec 23 2024 04:24:39 GMT+0000 (Coordinated Universal Time)
కవితను అరెస్ట్ చేస్తే..? కంగారులో కమలం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ రాజకీయ వర్గాల్లో అలజడి రేపుతుంది. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో అలజడి రేపుతుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియానే సీబీఐ అరెస్ట్ చేసింది. ఇక తర్వాత తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం అయితే ఊపందుకుంది. స్వయానా బీజేపీ నేతలే కవిత త్వరలో ఈ కేసులో అరెస్టవుతుందని చెబుతుండటంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇప్పటికే ఒకసారి సీబీఐ అధికారులు కవితను విచారించారు. మరోసారి ఢిల్లీకి పిలిపించి విచారణ చేసి అరెస్ట్ చేస్తారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతున్నాయి.
అమిత్ షా అర్జంట్ సమావేశం....?
దీనికి తోడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలను హుటాహుటిన ఢిల్లీకి రమ్మనడం, వారితో సమావేశం అవ్వడంపైన కూడా అనుమానాలు కలుగుతున్నాయి. కవిత అరెస్టయితే ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై ఎలా ఉండనుందన్న దానిపైనే షా నేతలతో చర్చించేందుకు ఢిల్లీకి పిలిపించారా? లేదా? మరేదైనా కారణమా? అన్నది తెలియకున్నా బయట మాత్రం ప్రచారం కవిత అరెస్ట్ గురించి ప్రధాన అజెండాగనే ఈ సమావేశంలో చర్చిస్తారని బీజేపీ నేతలు అనుకుంటున్నారు. ఈ ఏడాది చివరిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికలు ఉండటంతో...
ఇప్పటి వరకూ అరెస్ట్ చేసిన వారి గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. ఢిల్లీలో ఇప్పుడు ఎన్నికలు లేవు. అందుకే మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. వైసీపీ ఎంపీ కుమారుడిని అరెస్ట్ చేసినా అది పెద్దగా ఎన్నికలపై ప్రభావం చూపదు. ఇక కవిత విషయం అలా కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెగా కవితకు తెలంగాణలో ఒక స్థానం ఉంది. తెలంగాణ జాగృతి సంస్థను ఏర్పాటు చేసిన కవిత రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు. కవితను అరెస్ట్ చేస్తే సానుభూతి అధికార పార్టీకి దక్కే అవకాశం ఉందా? లేదా? అన్న దానిపైనే అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలతో చర్చించనున్నారని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.
పరిణామాలపై...
కవిత అరెస్టయితే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి? వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపుపై ఆ ప్రభావం ఉంటుందా? లేదా? శాంతిభద్రతలు తలెత్తే అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయి? అన్న దానిపైనే కమలం పార్టీ అగ్రనాయకత్వం సీరియస్ గానే దృష్టి సారించిందంటున్నారు. అసలే తెలంగాణలో బీజేపీకి పెద్దగా క్షేత్రస్థాయిలో బలం లేదు. ఇటీవల కొంత పుంజుకుంటుందనుకుంటున్న సమయంలో కవిత అరెస్ట్ ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న దానిపైనే కమలనాధులు కలవర పడుతున్నారని చెబుతున్నారు. మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తర్వాత అరెస్ట్ కవిత అంటూ బీజేపీ నేతలే బహిరంగ ప్రకటనలు చేస్తుండటం ఒక వైపు జరుగుతుంటే, అదే సమయంలో పార్టీ పెద్దలు నేతలతో మంతనాలు జరపడం కూడా అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉన్నాయి.
Next Story