ధావన్ సరికొత్త రికార్డు..!
టీమిండియా ఓపేనర్ శిఖర్ ధావన్ సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. అయితే, ఈసారి బ్యాటింగ్ లో కాకుండా ఫీల్డింగ్ లో ధావన్ రికార్డు సృష్టించాడు. ఫీల్డింగ్ లో చాలా చురుగ్గా ఉండే ధావన్... నిన్న ఏషియా కప్ లో దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ధావన్ ఏకంగా నాలుగు క్యాచ్ లు అందుకున్నాడు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు నజ్ముల్ హుస్సైన్, షాకిబ్ అల్ హసన్, మెహిదీ హసన్, ముస్తఫికర్ రెహమాన్ ల క్యాచ్ లు అందుకుని అవుట్ చేశారు. ఒక మ్యాచ్ లో వికెట్ కీపర్ కాకుండా ఎక్కువ క్యాచ్ లు అందుకున్న ఫీల్డర్ల సరసన ధావన్ నిలిచాడు.
దిగ్గజ ఆటగాళ్ల సరసన...
ఇక ప్రపంచ రికార్డు మాత్రం సౌతాఫ్రికా దిగ్గజ ఆటగాడు, అత్యుత్తమ ఫీల్డర్ గా గుర్తింపు పొందిన జాంటీ రూడ్స్ పేరుతో ఉంది. ముంబయి వేదికగా 1993లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో రూడ్స్ ఏకంగా 5 క్యాచ్ లు అందుకుని రికార్డు సృష్టించాడు. ఇక ఒక్క మ్యాచ్ లో నాలుగు క్యాచ్ లు అందుకున్న ఫీల్డర్లుగా సునీల్ గవాస్కర్(1985లో పాకిస్థాన్ పై షార్జాలో), మహమ్మద్ అజారుద్దిన్(1997లో పాకిస్థాన్ పై టోరంటోలో), సచిన్ టెండుల్కర్(1998లో పాకిస్థాన్ పై ధాకాలో), రాహుల్ ద్రావిడ్(1999లో వెస్టిండీస్‌పై టోరంటోలో), మహమ్మద్ కైఫ్(2003లో శ్రీలంకపై జోహన్నస్ బర్గ్ లో), వీవీఎస్ లక్ష్మణ్(2004లో జింబాబ్వేపై పెర్త్ లో) రికార్డు సాధించారు. వీరి సరసన ఇప్పుడు శిఖర్ ధావన్ కూడా చేరాడు. ఇక బ్యాటింగ్ లో కూడా ధావన్ రాణిస్తున్నాడు. ఏషియా కప్ లో మూడు మ్యాచ్ ల్లో 96.38 యావరేజ్ తో 213 పరుగులు సాధించి పరుగుల పట్టికలో మొదటి స్థానంలో నిలిచాడు.