ప్రశ్నిస్తే ఇరికిస్తారా...?
సిట్ నివేదికలో తన పేరు రావడంపై వైసీపీ నేత ధర్మాన అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసే విచారణలన్నీ కల్పితమేనన్నారు. భూ కుంభకోణాలపై పోలీసు అధికారులు ఎలా విచారణ చేపడతారని ప్రశ్నించారు. సిట్ లో రెవెన్యూ అధికారులు లేకపోవడమేంటని నిలదీశారు. భూకుంభకోణంపై సిట్ విచారణ సక్రమంగా జరగలేదన్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం జరిపిన విచారణల్లో నిజాయితీ ఎక్కడుందన్నారు. సిట్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
గొంతునొక్కితే... ప్రశ్నించడం మానేస్తామా?
విశాఖ భూకుంభకోణంలో తన పేరు ప్రస్తావించడంపై ఆయన ఫైరయ్యారు. భూ కుంభకోణంలో వాస్తవాలు బయటపెట్టాలని కోరినందుకే ఇలా చేస్తారా? అని ప్రశ్నించారు. మీ తాబేదార్లయిన అధికారులను పక్కన పెట్టుకుని ప్రతిపక్ష నేతలను కుంభకోణాల్లో ఇరికిస్తారా? అని మండిపడ్డారు. ప్రతిపక్షాలను గొంతునొక్కాలని చూస్తే బెదరే ప్రసక్తి లేదని చెప్పారు. ఈ భూకుంభకోణం వెనుక అసలు సూత్రధారలెవరో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.