Sat Nov 23 2024 03:25:05 GMT+0000 (Coordinated Universal Time)
డీకే బ్యాట్ ఇక పక్కన పెట్టాల్సిందేనా?
దినేష్ కార్తీక్ ఐపీఎల్ లో చెలరేగి ఆడాడు. దీంతో బీసీసీఐ కార్తీక్ కు టీ 20 వరల్డ్ కప్, ఆసియా కప్ లోనూ అవకాశం కల్పించింది.
ఐపీఎల్ లో సత్తా చూపిన ఆటగాళ్లు అంతర్జాతీయ మ్యాచ్ లకు వచ్చే సరికి డీలా పడిపోతున్నారు. 2022 లో జరిగిన ఐపీఎల్ లో ఎంతో మంది బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ సత్తా చాటారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో కొందరు చెలరేగి ఆడటంతో వారికి అంతర్జాతీయ మ్యాచ్ లలో అవకాశం దక్కింది. అటువంటి వారిలో సీనియర్ నేత దినేష్ కార్తీక్ ఒకరు. దినేష్ కార్తీక్ ఐపీఎల్ లో చెలరేగి ఆడాడు. దీంతో బీసీసీఐ కూడా కార్తీక్ కు టీ 20 వరల్డ్ కప్, ఆసియా కప్ లోనూ అవకాశం కల్పించింది. అయితే వరల్డ్ కప్ లో డీకే పెద్దగా ప్రతిభను కనపర్చలేకపోయాడు.
వయసు కూడా...
దీంతో న్యూజిలాండ్ పర్యటనలకు అందరు సీనియర్లను పక్కన పెట్టిన బీసీసీఐ దినేష్ కార్తీక్ కు కూడా విశ్రాంతి ఇచ్చింది. దినేష్ కార్తీక్ బ్యాట్ కు పదును ఉండవచ్చు. కానీ అతని వయసు 37 సంవత్సరాలు. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగాలంటే కష్టమే. వయసు పరంగానే కాకుండా, ఆట పరంగా కూడా దినేష్ కార్తీక్ కు ఇటీవల జరిగిన వరల్డ్ కప్ చివరిది కావచ్చు. బీసీసీఐ మరోసారి డీకే తో ప్రయోగం చేయకపోవచ్చు. యువతరానికి ఛాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త యువ ఆటగాళ్లు ఫెయిలవుతున్నా కొన్ని అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడితేనే వారి ఆట మెరుగు పడుతుంది.
ఎమోషనల్ పోస్టుతో...
దినేష్ కార్తీక్ కు ఈ విషయం తెలియంది కాదు. అందుకే ఇటీవల ఆయన ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఇన్ స్టాలో పెట్టిన పోస్టుతో డీకే రిటైర్మెంట్ ఆలోచన చేస్తున్నారని క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు. తాను టీం ఇండియా తరుపున టీ 20 ప్రపంచకప్ లో ఆడాలని అనుకున్నానని, అందుకోసం తాను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని, వరల్డ్ కప్ లో విజయం సాధించకపోయినా ఎన్నో జ్ఞాపకాలు తనకు చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆయన పోస్టు చేశారు. తనకు మద్దతుగా నిలిచిన సహచర ఆటగాళ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
యువ ఆటగాళ్లకు...
దీంతో దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ యోచన చేస్తున్నారని బలంగా విశ్వసించాల్సి వస్తుంది. చాలా రోజుల తర్వాత తిరిగి క్రికెట్ లోకి వచ్చి ఐపీఎల్ లో చెలరేగి ఆడి అంతర్జాతీయ మార్కెట్ లో చోటు దక్కించుకున్న డీకే స్వచ్ఛందంగానే క్రికెట్ నుంచి తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని క్రికెట్ పండితులు కూడా చెబుతున్నారు. క్రికెట్ లో ఫెయిల్యూర్, సక్సెస్ అనేది ఒక భాగమని, కానీ కొంతకాలం తర్వాత ఎంత ఆటగాడైనా రిటైర్మెంట్ తీసుకోక తప్పదని చెబుతన్నారు. ఆసియా కప్, వరల్డ్ కప్ లో పెద్దగా రాణించలేకపోయిన డీకే మంచి ఫినిషర్ గా పేరు చిరస్థాయిగా నిలవాలంటే రిటైర్మెంట్ బెటర్ అనే వారు లేకపోలేదు. ఆ స్థానంలో మరో యువ ఆటగాడికి దక్కుతుందని, ఇండియాలో క్రికెటర్లకు కొదవ లేదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. మరి డీకే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Next Story