Mon Dec 23 2024 12:59:31 GMT+0000 (Coordinated Universal Time)
దూరమయిన వారు దగ్గరవుతారా?
వైసీపీపై ఉన్న అసంతృప్తి టీడీపీకి ఓట్లు టర్న్ అవ్వొచ్చేమో కాని దానికంటూ ఒక స్థిరమైన ఓటు బ్యాంకు ఇప్పుడు లేకుండా పోయింది.
తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆ పార్టీకి అసలు ఓటు బ్యాంకు ఉందా? లేదా? అన్న చర్చ బలంగా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలమైన రాజకీయ పార్టీ. చంద్రబాబు విజన్ ఉన్న నేత. దానిని ఎవరూ కాదనలేరు. కానీ ఈసారి పార్టీకి ప్రత్యేక ఓటు బ్యాంకు అంటూ లేకుండా పోయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తితో చంద్రబాబుకు ఓట్లు టర్న్ అవ్వొచ్చేమో కాని, దానికంటూ ఒక స్థిరమైన ఓటు బ్యాంకు ఇప్పుడు ఏపీలో లేకుండా పోయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
బీసీల పార్టీగా...
తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీగా ముద్ర ఉండేది. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా అనేక పథకాలు కూడా ప్రవేశపెట్టి జెండాకు దగ్గర చేర్చాయి. 2014 ఎన్నికల వరకూ బీసీలు టీడీపీ వైపు ఉన్నారు. అయితే 2019 ఎన్నికల నాటికి జగన్ బీసీలను తన వైపునకు తిప్పుకోగలిగారు. జగన్ పార్టీకి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మద్దతు ఉంది. కాంగ్రెస్ నుంచి ఆ వర్గాలను తాను ట్రాన్స్ ఫర్ చేసుకోగలిగాడు. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో బీసీ వర్గాలను ప్రసన్నం చేసుకోగలిగాడు. అందుకే అంత మెజారిటీ. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ బీసీ జపం తప్ప మరేదీ చేయడం లేదు. పదవుల దగ్గర నుంచి నామినేటెడ్ పనుల వరకూ బీసీలకు ప్రాధాన్యత ఇస్తుండటంతో ఆ వర్గం చాలా వరకూ వైసీపీ వైపు మొగ్గు చూపుతోంది. బీసీ నేత ఆర్ కృష్ణయ్య కు కూడా రాజ్యసభ పదవి ఇచ్చారు.
కొన్ని వర్గాలు...
ఇక చంద్రబాబు పార్టీకి ప్రత్యేకంగా ఒక వర్గం అంటూ లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో కాపులు కూడా పవన్ కల్యాణ్ వైపు మొగ్గు చూపుతారు కాని టీడీపీ వైపు చూడరు. ఇక బ్రాహ్మణ, వైశ్య, కమ్మ, క్షత్రియ సామాజికవర్గాలు మాత్రం ఒకింత చంద్రబాబు వైపు చూసే అవకాశముంది. వాటిలో కూడా పూర్తిగా చంద్రబాబు వైపు లేరు. మెజారిటీ శాతం ఉన్నారని చెప్పొచ్చు. అయితే ఈ వర్గాలు ఎవరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయని పరిస్థితి. పోలింగ్ కేంద్రాల వద్ద రష్ ఉంటే ఈ వర్గాలు అటు వైపు కూడా రారన్నది కాదనలేని వాస్తవం. అందుకే చంద్రబాబు భయమంతా ఇప్పుడు పోయిన వర్గాలను దగ్గరకు చేర్చుకోవడమే.
బీసీలను దరిచేర్చుకునేందుకు...
ప్రధానంగా బీసీలను దరి చేర్చుకోవడానికి ఆయన ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఆయన ఎన్నికల మ్యానిఫేస్టోలోనూ వారికి పెద్దపీట వేస్తారు. స్పష్టమైన హామీలను వారికి ఇవ్వనున్నారు. ఏపీలో బీసీలు బలంగా ఉన్నారు. వారిని దరి చేర్చుకునేందుకు చంద్రబాబు ఇప్పటి నుంచే ఫీట్లు చేయకతప్పదు. యువత కొంత చంద్రబాబు వైపు ఈసారి మొగ్గుచూపే అవకాశముందంటున్నారు. వారి పరిస్థితి కూడా అంతే. ఓటు వేసేవరకూ నమ్మకం లేదు. అందుకే చంద్రబాబు ఇప్పుడు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారన్నది వాస్తవం. ఎన్నికలలోపు బీసీలను తన వైపునకు మరల్చుకోగలిగితే చంద్రబాబు సగం విజయం సాధించినట్లే. కానీ అది ఎంత వరకూ సాధ్యమనేది చూడాల్సి ఉంది.
Next Story