దీపావళి వేడుకల్లో మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు మంచి స్నేహితుడని, ఆయనతో స్నేహం చేయడం గొప్పగా భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యనించారు. మోదీ ఇప్పుడు తన కూతురు ఇవాంకా ట్రంప్ స్నేహితుడి కూడా అని పేర్కొన్నారు. అమెరికా శ్వేతసౌధంలో ఇండో-అమెరికన్ల కోసం జరిగిన దీపావళి వేడుకల్లో ట్రంప్, ఇవాంక పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వళన చేసి ఆయన ఈ వేడుకలను ప్రారంభించారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్ తో అమెరికా సంబంధాలు స్వచ్ఛ, శాంతి, సామరస్యానికి దోహదపడదాయని పేర్కొన్నారు. దీపావళి వేడుకల్లో పాల్గొనడం తనకు ఉత్సాహంగా ఉందన్నారు. భారత్ తో మెరుగైన వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు.
2003 నుంచి మొదలు...
శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు జరపడం 2003లో జార్జి బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రారంభమైంది. కానీ, ఆయన ఎప్పుడూ వేడుకల్లో పాల్గొనలేదు. 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. 2013లో ఒబామా సతీమణి మిషేల్ ఒబామా వేడుకల్లో పాల్గొని స్థానిక విద్యార్థులతో కలిసి బాలీవుడ్ పాటలకు డ్యాన్సులు కూడా చేశారు. 2016లో ఒబామా మరోసారి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 2017 మొదటిసారి అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.