Mon Dec 23 2024 17:35:05 GMT+0000 (Coordinated Universal Time)
అక్కడ రూపాయి.. ఇక్కడ ఇరవై
టమాటా దిగుబడి ఎక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి ఎక్కువగా ఉండటంతో టమటా ధర దారుణంగా పడి పోయింది
రైతు నష్టపోతున్నాడు. వినియోగదారుడు జేబులకు చిల్లు పడుతుంది. మధ్యలో లాభపడేది మాత్రం దళారి మాత్రమే. ఏపీలో టమాటా రైతు పరిస్థితి. టమాటా దిగుబడి ఎక్కువగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి ఎక్కువగా ఉండటంతో టమటా ధర దారుణంగా పడి పోయింది. దీంతో రైతుకు కనీసం కిలోకు రూపాయి కూడా ధర లభించడం లేదు. పత్తికొండ మార్కెట్ లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లి మార్కెట్ లోనూ ఇదే పరిస్థితి. ఏపీ నుంచి తెలంగాణకు మాత్రమే టమాటా పంపుతున్నారు.
పొలాల్లోనే వదిలేసి...
రైతులు టమాటాను కోయడానికి కూలీలకు, మార్కెట్ కు తరలించడానికి రవాణా ఖర్చులు అవుతున్నాయి. దీంతో కొందరు రైతులు టమాటాను పొలాల్లోనే వదిలేసి పశువులకు మేతగా వదిలేస్తున్నారు. టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నా దానిని అమలులోకి మాత్రం ప్రభుత్వం తేవడం లేదు. కనీసం కోల్డ్ స్టోరేజీ లు కూడా అందుబాటులో లేదు. దీంతో రైతులు టమాటాను రోడ్డుపైన పారబోసి వెళుతున్నారు. ఎకరాకు ముప్ఫయివేలు పెట్టుబడి పెడితే కనీసం వందల్లో కూడా ధర పలకడం లేదని చెబుతున్నారు.
బయట మార్కెట్ లో...
మరోవైపు బయట మార్కెట్ లో వినియోగదారుడికి మాత్రం కిలో టమాటా ఇరవై రూపాయలకు దొరుకుతుంది. టమాటా రైతు నుంచి రూపాయికి కొనుగోలు చేసి వినియోగదారుడికి చేరే సరికి ఇరవై రూపాయలకు చేరుకుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతుకు గిట్టుబాటు ధర లభించేలా చేయాలని కోరుతున్నారు. అలాగే వినియోగదారులు కూడా నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Next Story