Mon Dec 23 2024 09:28:58 GMT+0000 (Coordinated Universal Time)
యువగళంలోనే చేరికలు.. నారావారి నయా ప్లాన్
నారా లోకేష్ యువగళం పాదయాత్రకు హైప్ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన పాదయాత్ర ప్రారంభించి నెల రోజులు దాటింది
నారా లోకేష్ యువగళం పాదయాత్రకు హైప్ తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన పాదయాత్ర ప్రారంభించి నెల రోజులు దాటింది. జనవరి 27వ తేదీన నారా లోకేష్ కుప్పం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో చేరినా అది లోకేష్ ఖాతాలో పడలేదు. కన్నా బీజేపీకి రాజీనామా చేయడం వెనువెంటనే ఆయన టీడీపీలో చేరిపోవడం జరిగిపోయాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కన్నా చేరినా ఆయన జాయినింగ్ కార్యక్రమానికి లోకేష్ రాలేదు. పాదయాత్రలో ఉండబట్టి లోకేష్ కూడా ఇటువైపు చూడలేదంటున్నారు.
హైప్ తెచ్చేందుకే...
అందుకే చంద్రబాబు నారా లోకేష్ పాదయాత్రలో చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అవసరమైతే నేతలను పాదయాత్ర వద్దకే రప్పించి అక్కడికే తాను వెళ్లి నేతలకు కండువా కప్పాలని చంద్రబాబు భావిస్తున్నారట. ఇందుకోసం ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల జాబితాను ఇప్పటికే రూపొందించారని తెలిసింది. లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో జరుగుతుంది. ఆ తర్వాత ఆయన పాదయాత్ర అనంతపురం జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అనంతపురం జిల్లాలో ఒక నేత పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారని తెలిసింది. గతంలో టీడీపీలో ఉండి 2019 ఎన్నికల తర్వాత పార్టీని వీడి వెళ్లిన నేత తిరిగి వచ్చేందుకు రెడీగా ఉన్నారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఈ నేత చేరిక ఉండే అవకాశముందని చెబుతున్నారు.
ఆనం చేరికా అప్పుడే...
ఇక అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో యువగళం పాదయాత్ర ముగించుకుని నారా లోకేష్ పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలోనే మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలని చంద్రబాబు సిద్ధమవుతున్నారట. ఆనం కూడా పార్టీ మారక తప్పని పరిస్థితి. నెల్లూరు జిల్లాలో పార్టీ కొంత బలోపేతం కావాలంటే ఆనం రామనారాయణరెడ్డి వంటి నేతలు అవసరం. అందుకే ఆయనను పార్టీలో చేర్చుకోవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారంటున్నారు. పాదయాత్రలోనే పెద్ద సభ పెట్టి ఆనం చేరిక ఉండేలా చూడాలని ఇప్పటికే కొందరు ముఖ్యనేతలను చంద్రబాబు ఆదేశించారని తెలిసింది. దీంతో పాటు అదే సమయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కూడా అదే సమయంలో కండువా కప్పే అవకాశముందని చెబుతున్నారు.
కేంద్ర కార్యాలయంలో కాకుండా...
ఇక లోకేష్ పాదయాత్ర కోస్తాలోకి ఎంటర్ అయిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును పార్టీలోకి ఆహ్వానించాలని సిద్ధమవుతున్నారు. అప్పటికి ఇంకా ఎన్నికలకు పెద్దగా సమయం ఉండదు. ఉప ఎన్నికలు వచ్చే అవకాశముండదన్న అంచనాలో టీడీపీ అగ్రనేతలున్నారని తెలిసింది. చేరికలు పార్టీ కేంద్ర కార్యాలయానికే పరిమితం చేయకుండా లోకేష్ పర్యటన సమయంలో చేరికలు ఉండేలా చంద్రబాబు స్వయంగా ప్లాన్ చేస్తున్నారట. ఇది రాబిన్ శర్మ ఆలోచన అయినప్పటికీ నేతలతో నేరుగా చంద్రబాబు మాట్లాడుతూ వారికి డేట్స్ ఫిక్స్ చేస్తున్నారని సమాచారం. మొత్తం మీద లోకేష్ యువగళానికి మరింత హైప్ చేరికలతో తేవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది చూడాల్సి ఉంది.
Next Story