మొత్తానికి ఈసీ తేల్చింది ...!
కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు ఎపి తెలంగాణ నడుమ వివాదాస్పదంగా మారిన పోలవరం ముంపు మండలాల సమస్య ఎన్నికల కమిషన్ తేల్చేసింది. గత ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పడకుండా కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ కి సమస్యలు తలెత్తకుండా తెలంగాణ పరిధిలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. అప్పటినుంచి ఈ మండలాల్లోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విభజన కింది స్థాయి వరకు అధికార యంత్రాంగం అమలు చేయడంలో విఫలం కావడంతో అటు తెలంగాణ కు ఇటు ఆంధ్రప్రదేశ్ కు చెందకుండా రెండిటికి చెడ్డ రేవడిలా మారింది ముంపు మండలాల సమస్య. సాంకేతికంగా ఆంధ్రప్రదేశ్ కు చెందినవిగా ఉన్నా ప్రభుత్వాల ద్వారా అందాలిసిన సంక్షేమ ఫలాలు వారికి పూర్తిగా ఏ సర్కార్ నుంచి అందేవి కాదు.
టి ఎన్నికల పుణ్యమా అని ....
పోలవరం ముంపు విలీన మండలాల్లో అత్యధిక శాతం ఏజెన్సీ లో వున్నాయి. అదికూడా అధికార యంత్రాంగం సాయం అందించడానికి అవరోధమైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో అభివృద్ధి కి వారంతా ఆమడ దూరంలో నిలవాలిసి వచ్చింది. తాజాగా తెలంగాణ సర్కార్ ముందస్తు ఎన్నికల నగారా మోగించడంతో ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఈ అంశంపై దృష్టి పెట్టి ముందు ఓటర్ల సమస్య పరిష్కరించింది. భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక్క భద్రాచలం తప్ప అన్ని మండలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉండేలా గెజిట్ జారీ చేసింది. దాంతో సాంకేతికంగా ఇప్పటివరకు త్రిశంకు స్వర్గంలో వున్న వారికి మోక్షం లభించింది. ఈసీ గెజిట్ ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజక వర్గ పరిధిలోకి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు సీతానగరం, శ్రీధర వేలేరు, గుంపనాపల్లి, గణపవరం, ఇబ్రహీంపట్నం, రావిగూడెం చేర్చబడ్డాయి. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం పరిధిలో కూనవరం, చింతూరు, విఆర్ పురం, ఎటపాక మండలాలు ఉంటాయి.