Sat Nov 16 2024 19:44:42 GMT+0000 (Coordinated Universal Time)
మారిన ఎన్నికల తీరు.. ఏమైపోతుందో?
994 వరకూ ఎన్నికలు బాగానే ఉండేవి. అభ్యర్థులు, పార్టీలు విస్తృతంగా ప్రచారం చేసుకునేవారు.
1994 వరకూ ఎన్నికలు బాగానే ఉండేవి. అభ్యర్థులు, పార్టీలు విస్తృతంగా ప్రచారం చేసుకునేవారు. అభిమానులు ప్రచారంలో పాల్గొనేవారు. ఎన్నికలప్పుడు ఓట్లకు డబ్బులు ఇచ్చేవారు కానీ అవి ఒక ఊరికో, కులానికో, నాయకుడికో గంపగుత్తగా ఇచ్చేవారు. ఆ డబ్బు ఉమ్మడి అవసరాలకు వాడుకునే వారు. 1994 తర్వాత పోల్ మేనేజ్మెంట్ వచ్చేసింది. నేరుగా ఓటరుకు డబ్బులు ఇవ్వడం మొదలైంది. అప్పటి నుండి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రచారం తీరు కూడా మారింది. ఊరికి ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యే, మండలానికి ఓ ఎంపీ ప్రచార బాధ్యతలు తీసుకోవడం మొదలైంది. డబ్బు ప్రవాహం కూడా అప్పుడే మొదలైంది.
ఒకే పేరున్న అభ్యర్థులను...
2011లో పోల్ మేనేజ్ మెంట్ ఓ కొత్త పుంత తొక్కింది. ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకు ప్రత్యర్థి పేరున్న వారిని స్వతంత్ర అభ్యర్ధులుగా రంగంలోకి దింపి విస్తృత ప్రచారం చేయడం మొదలైంది. అందుకే 2011లో జగన్ పోటీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే పేరున్న మరో నలుగుర్ని స్వతంత్ర అభ్యర్ధులుగా రంగంలోకి దింపారు. "జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల గుర్తు ఫ్యాన్" అంటూ వీరు ప్రచారం చేస్తే, "జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు అగ్గిపెట్టి" అని ఒకరు, "జగన్మోహన్ రెడ్డి గారి గుర్తు కొవ్వొత్తి" అని ఇంకొకరు ప్రచారం చేస్తూ ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడం మొదలు పెట్టారు.
అదే పేర్లున్న....
ఈ పద్ధతి 2019 ఎన్నికల్లో ఎంతవరకు వెళ్లిందంటే రాష్ట్రం మొత్తంలో 136 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లు ఉన్నవారినే స్వతంత్ర అభ్యర్ధులుగా, కె ఏ పాల్ పార్టీ అభ్యర్థులుగా పోటీకి దింపారు. పర్చూరులో కూడా దగ్గుబాటి వెంకటేశ్వర రావు కు పోటీగా మరో దగ్గుబాటి వెంకటేశ్వర రావును పాల్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. అంతకు ముందు 2017 లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో ఏకంగా దొంగ ఓటర్ కార్డులే వచ్చేశాయి. ప్రతి ఇంటిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, వారి వయసు ఎంత, పోలింగ్ తేదీ నాటికి ఓటేయడానికి రానివారెవరు అనే వివరాలు సేకరించి, ఓటుకు రానివారు అనుకున్న ప్రతి పేరుతో పక్క ఊళ్లనుండి ఆ వయసు వారిని తెచ్చి నకిలీ ఓటరు కార్డు సిద్ధం చేశారు. ప్రత్యేకంగా ఇందుకోసం ఓ ఎమ్మెల్యే కంప్యూటర్లు పెట్టుకుని ఓ టీమ్ తో పని చేశారు.
గతంలోనే...
ఇక 2019 తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ప్లాన్ ఎ, ప్లాన్ బి అని ఇంకో పద్ధతి మొదలైంది. ప్రత్యర్థి పార్టీలోనూ మనవాళ్ళే ఉండడం, టికెట్ తెచ్చుకోవడం, నామినేషన్ వేయకపోవడం లేదా వేసిన నామినేషన్ ఉపసంహరించుకోవడం. వాస్తవానికి ఈ పద్ధతి కొత్తదేం కాదు. 1994 ఎన్నికలకు ముందు అంతర్గతంగా టీడీపీలో ఉంది. బాబు, దగ్గుబాటి, లక్ష్మీపార్వతి వర్గాలు ఉండేవి. అందులో లక్ష్మీపార్వతి వర్గంలో ఇంకో వర్గం వ్యక్తులే ఎక్కువమంది ఉండేవారు. ఇక ఈ పద్ధతి కుదరకపోతే ప్లాన్ బి ఉంది. ఈ ప్లాన్ బి ప్రకారం ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని కొనేయడం. ఓటర్లను కొనడం కంటే ఇది సులువైన పద్ధతి. ఎన్నికల తంతు ఇంకా ఎన్ని పుంతలు తొక్కుతుందో కాలమే చెప్తుంది.
Next Story