Sat Nov 23 2024 17:08:34 GMT+0000 (Coordinated Universal Time)
ఈడీ.. టీడీపీ.. ఏపీలో ఏం జరుగుతోంది?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు పెరుగుతున్నాయి. టీడీపీ మద్దతుదారులనే లక్ష్యంగా చేసుకున్నారంటున్నారు
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులు జరుగుతున్నాయా? అంటే అవుననే అనిపిస్తుంది. జేసీ ప్రభాకర్ రెడ్డితో మొదలయిన ఈడీ దాడులు వరసగా టీడీపీ అనుకూల వర్గాలపై తనిఖీలకు దిగుతున్నట్లే కనిపిస్తున్నాయి. టీడీపీని ఆర్థిక దిగ్భంధనం చేయడానికి, ఆ పార్టీకి అనుకూలురైన వారిని భయపెట్టడానికి ఈడీ, ఐటీ రూపంలో దాడులు జరుగుతున్నాయా? అన్న అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. ఎందుకంటే వరసగా జరుగుతున్న ఐటీ, ఈడీ దాడులు పసుపు పార్టీకి చెందిన సానుభూతిపరులనే టార్గెట్ చేస్తూ జరుగుతున్నవే కావడం గమనార్హం. అయితే రాజకీయంగా జరుగుతున్న దాడులని ఎవరూ చెప్పకపోయినా.. జరుగుతున్న దాడులన్నీ ప్రతిపక్ష టీడీపీకి అనుకూలురుకు చెందినవే కావడంతో భయభ్రాంతులను చేయడానికేనన్న అనుమానాలు కలుగుతున్నాయి.
టీడీపీ అనుకూలురు...
సాధారణంగా ఎన్నికలకు ముందు ఐటీ, ఈడీ దాడులు జరుగుతుంటాయని రాజకీయ నేతలు లెక్కలు వేసుకుంటారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు నిధులు మళ్లించేందుకు ఏ పార్టీకి అనుకూలురైనా పారిశ్రామికవేత్తలు ఆ పార్టీకి ఉంటారు. ఎన్నికల సమయంలో ఈ నిధులు ఉపయోగపడతాయి. ఏపీలో ఈసారి ఎలాగైనా టీడీపీ అధికారంలోకి రావాలనుకుంటుంది. ఇప్పటికే ఆర్థికంగా, రాజకీయంగా పార్టీ కొంత ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు ఆ పార్టీ ఆర్థిక మూలాలపైన కూడా దెబ్బతీసే విధంగా ఈ దాడులు జరుగుతున్నట్లు జరుగుతున్న సంఘటనలను బట్టి అర్థమవుతుంది.
జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన...
జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన 22 కోట్ల ఆస్తులను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. పెనుకొండలోని టీడీపీ నేత సవిత ఇంట్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సవిత భర్త రైల్వే కాంట్రాక్టర్ కావడంతో అందిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఇక తాజాగా బెజవాడలో మంగళగిరి ఎన్నారై ఆసుపత్రి, అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలోనూ ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించాయి. రెండు రోజుల పాటు జరిపిన ఈ సోదాల్లో అనేక కీలక విషయాలను రాబట్టింది.
రెండు ఆసుపత్రులు...
రెండు ఆసుపత్రులు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులకు చెందినవే. దాదాపు 43 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. కోవిడ్ సమయంలో వసూలు చేసిన నిధులకు లెక్కలు లేకుండా చేయడం, అక్కినేని ఆసుపత్రిలో అదనపు భవనం నిర్మాణం కోసం వసూలు చేసిన సొమ్ము కూడా హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ కంపెనీలకు మళ్లించారని ఈడీ, ఐటీ అధికారులు గుర్తించారంటారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సోదాలతో ఒక వర్గంలో భయం మొదలయిందంటున్నారు. పక్కా సమాచారంతోనే ఈ దాడులు జరుగుతున్నాయంటున్నారు.
స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్...
ఇక తాజాగా స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ ఈడీ 26 మందికి నోటీసులు జారీ చేసింది. మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ, మాజీ ఎండీ గంటా సుబ్బారావులతో పాటు అనేక మందికి నోటీసులు జారీ చేసింది. ఐటీశాఖకు అప్పట్లో నారాలోకేష్ మంత్రిగా ఉన్నారు. ఈరోజు వారు హైదరాబాద్ లో ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ స్కిల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ గత చంద్రబాబు హయాంలో ఏర్పాటయిందే. ఇందులో 370 కోట్ల చెల్లింపులకు సంబంధించి జీఎస్టీ చెల్లించలేదని, అవకతవకలు జరిగాయని అనుమానిస్తుంది. ఇలా గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలతో పాటు టీడీపీ అనుకూలురు మీదనే ఈడీ, ఐటీ దాడులు జరుగుతుండటం రాజకీయంగా కలకలం రేపుతుంది.
Next Story