Mon Dec 23 2024 03:04:43 GMT+0000 (Coordinated Universal Time)
జై భజరంగ భళి... హేళి
కర్ణాటక ఎన్నికలు మొత్తం ఇప్పుడు హనుమాన్ చుట్టూనే తిరుగుతున్నాయి
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతుంది. బీజేపీ అగ్రనేతలు ఇప్పటికే ప్రచారాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేడు కర్ణాటకలో రోడ్ షోలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హుబ్లీ తదితర ప్రాంతాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొంటున్నారు. అయితే కర్ణాటక ఎన్నికలు మొత్తం ఇప్పుడు హనుమాన్ చుట్టూనే తిరుగుతున్నాయి. జై భజరంగభళి అంటూ బీజేపీ నేతలు చేసే నినాదాలతో కన్నడనాట రాజకీయాలు మరింత హీటెక్కాయి.
హనుమాన్ చాలీసా పఠిస్తూ...
కర్ణాటకలో బీజేపీ నేతలు హనుమాన్ చాలీసా పఠిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా హనుమాన్ దేవాలయాల చుట్టూ ప్రదిక్షిణలు చేస్తున్నారు. మొత్తం మీద హనుమాన్ కర్ణాటక ఎన్నికలను శాసిస్తున్నాయని చెప్పక తప్పదు. నిజానికి కాంగ్రెస్ చేసిన తప్పేంటంటే? ఎవరికీ అర్థంకాదు. తమ మ్యానిఫేస్టోలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన పీఎఫ్ఐ వంటి సంస్థలతో పాటు భజరంగ్ దళ్ వంటి వాటిని కూడా నిషేధిస్తామని తెలిపింది. అంతే.. కన్నడ రాజకీయాల్లో ఇబ్బంది పడుతున్న బీజేపీకి ఈ పాయింట్ దొరికింది. ప్రధాని నుంచి కింది స్థాయి వరకూ హనుమాన్ జపం చేస్తున్నారు. జై భజరంగభళి అంటూ ఎన్నికల్లో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
గోవాలో శ్రీరామసేనపై..
నిన్నటి వరకూ అన్ని సర్వేల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. హనుమాన్ ఎంట్రీతో కొంత బీజేపీకి అడ్వాంటేజీ ఉంటుందన్న అంచనాలు వినపడుతున్నాయి. అయితే అది ఏ మేరకు ఉంటుందన్నది చెప్పలేని పరిస్థితి. అయితే కాంగ్రెస్ నేతలు కూడా ధీటుగానే ప్రశ్నిస్తున్నారు. గోవాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్కడ శాంతిభద్రతలను కాపాడటంలో భాగంగా శ్రీరామసేనపై నిషేధం విధించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. గోవాలో శ్రీరామ్ సేనను నిషేధిస్తే శ్రీరాముడిపైన నిషేధం ప్రకటించినట్లేనా? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజల్లో ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఓటు బ్యాంకు...
మరో వైపు హనుమాన్ అంశం ఎంత మేర ఎన్నికల మంత్రంగా పనిచేస్తుందన్నది చూడాల్సి ఉంది. హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ తంటాలు పడుతున్నా ఎంత శాతం ఓటు బ్యాంకు తమకు టర్న్ అవుతుందన్నది అనుమానంగానే ఉందని అంటున్నారు. కాంగ్రెస్ తన మ్యానిఫేస్టోలో శాంతిభధ్రతలకు విఘాతం కలిగిస్తేనే నిషేధం ఆలోచన చేస్తామని చెప్పినా ఇంత రాద్ధాంతం చేయడం ఓటమి కళ్ల ముందు కనిపించే కమలనాధులు ఇలా చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తాము ప్రజాస్వామ్య యుతంగా, రాజ్యాంగ బద్ధంగా ముందుకు వెళతామని, అంతే తప్ప నిషేధం అని అనలేదని అంటున్నారు. బీజేపీ మాత్రం హనుమాన్ జపం వదిలిపెట్టడం లేదు. మరి ఎన్నికలకు ముందు వచ్చిన హనుమాన్ ఏ పార్టీని గట్టెక్కిస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story