Mon Dec 23 2024 18:35:55 GMT+0000 (Coordinated Universal Time)
శ్రావణ శుక్రవారం....వరలక్ష్మి వ్రతం
పల్లె నుంచి పట్నం వరకూ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ శ్రావణ శుక్రవారం
పల్లె నుంచి పట్నం వరకూ మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగ శ్రావణ శుక్రవారం. ఈరోజు జరిపే పూజలతో తన భర్త ఆయురారోగ్యంతో ఉంటారని, అష్టఐశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు. అందుకే ఈరోజు మహిళలు లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆగస్టు మాసం అంతా శ్రావణ శుక్రవారాలు అని భావిస్తున్నా, ఈ నెల ఐదో తేదీన అత్యంత ముఖ్యమైన దినంగా మహిళలు భావిస్తారు. అందుకే ఈ నెల 5వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లో మహిళలు వరలక్ష్మీ దేవికి పూజలు చేస్తారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు.
ముత్తయిదువులు...
ముత్తయిదువులు చేసుకునే ఈ పండగకు ఎంతో విశిష్టత ఉంది. అమ్మవారిని పసుపుతో అలంకరిస్తారు. స్థాయిని బట్టి విగ్రహాన్ని రూపొందించుకుంటారు. కొత్త నగతో మంచిదని మహిళలు భావిస్తుంటారు. అందుకే శ్రావణ శుక్రవారంలో ప్రతి మహిళ గ్రాము బంగారాన్నైనా కొనుగోలు చేస్తారు. అందుకే ఈ మాసంలో బంగారానికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. లక్ష్మీ రూపులను కూడా కొనుగోలు చేస్తారు. వాటిని అమ్మవారి వద్ద ఉంచి తమ మంగళసూత్రంలో కట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది. దానివల్ల భర్త పూర్తి ఆయురోరాగ్యాలతో ఉంటారని మహిళలు భావిస్తారు.
ఇష్టమైన పిండి వంటలు...
ఉదయమే నిద్రలేచి ఇంటిని శుభ్రపర్చుకుంటారు. ముగ్గులతో అలంకరిస్తారు. దేవతా విగ్రహాలను శుభ్రం చేసుకుంటారు. తలంటి వరలక్ష్మీ విగ్రహాన్ని ఆభరణాలతో పూలతో అలంకరిస్తారు. తల స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరిస్తారు. అమ్మవారికి ఇష్టమైన వంటకాలను సిద్ధం చేసుకుంటారు. ఆరోజు అమ్మవారికి అనేక రకాలైన పిండి వంటకాలను తయారు చేసి ఆమెకు నైవేద్యంగా పెడతారు. లక్ష్మీదేవి భర్త విష్ణువు జన్మ నక్షత్రం కావడంతో ఈరోజుకు ఎంతో విశిష్టత ఉందని నమ్ముతారు. అందుకే భక్తి శ్రద్ధలతో మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. ఇళ్లల్లో ఈశాన్యంలోనే అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటారు.
ప్రత్యేకంగా రూపొందించిన...
ఇంట్లో ఈశాన్య ఉన్న పూజా మందిరంలో కాని, లేక ప్రత్యేకంగా తయారు చేయించిన మందిరంలో అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారి ఉంచే వేదికకు పసుపు పూసి కలశపు చెంబును పసుపుతో అద్ది, కుంకుమను దిద్ది అమ్మవారిని అందులో ప్రతష్టిస్తారు. కొబ్బరికాయలో అమ్మవారి రూపాన్ని తీర్చిదిద్దుతారు. మామిడాకులను ఉంచుతారు. అమ్మవారి ఉంచే వేదికపై ముగ్గులు వేస్తారు. ఆరోజంతా కొందరు ఉపవాసం ఉంటారు. మరికొందరు ఉదయం అల్పాహారం తినకుండా మధ్యాహ్న భోజనం చేస్తారు. ఇందులో పెద్దగా శాస్త్రాల్లో నియమనిబంధనలు లేకపోయినా అందరూ ఉపవాసం చేయడానికే ప్రయత్నిస్తారు. చేతికి తమల పాకుతో తయారు చేసిిన తోరం ధరిస్తారు. వరలక్ష్మి కథను చదవి అమ్మవారిని పూజిస్తారు. అనంతరం సాయంత్రం ముత్తయిదువలను పిలిచి శెనగలు, పండ్లతో కూడిన తాంబూలాలను అందచేస్తారు. ఇది మహిళలకు ఒక ప్రత్యేక పండగ.
Next Story