Sun Nov 17 2024 18:52:24 GMT+0000 (Coordinated Universal Time)
ప్రవీణ్ ప్రకాష్.. ప్లేస్ ఆ సీనియర్ అధికారికేనా?
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంగా ఉన్న ఈవో జవహర్ రెడ్డిని సీఎంవో కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది
ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా ఎవరిని నియమిస్తారన్న చర్చ జరుగుతోంది. ఐఏఎస్ లలో ఇది ప్రధానమైన, కీలకమైన పోస్టు. సీఎంవో కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయనను ఢిల్లీ ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో మరో సీనియర్ అధికారిని నియమించాల్సి ఉంది. అది ఎవరన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది.
కీలకమైన పోస్టు....
ముఖ్యమంత్రి జగన్ గత మూడేళ్లుగా అధికారులపైనే ఆధారపడి పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయినప్పుడు వాటికి న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సీఎంవో కార్యదర్శిపైనే ఉంటుంది. దీంతో పాటు పాలనపరమైన విషయాలతో పాటు రాజకీయంగా కూడా అధికార పార్టీ నేతలకు కొంత అందుబాటులో ఉంటూ వారి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది.
ఇబ్బంది లేకుండా....
జగన్ కు, పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా సీఎంవో కార్యదర్శి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో ఎన్నికల సమయం పెద్దగా లేదు. గట్టిగా రెండేళ్లు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు విమర్శలు పాలు కాకుండా ఉండాలి. ముఖ్యమంత్రికి వాస్తవాలు వివరించి, ఆయన అంగీకారంతో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ కీలకమైన సమయంలో సీఎంవో కార్యదర్శిగా అనుభవం, ప్రభుత్వానికి మచ్చ తేకుండా ఉండే ఐఏఎస్ అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది.
ఆయనే అయితే...?
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంగా ఉన్న ఈవో జవహర్ రెడ్డిని సీఎంవో కార్యదర్శిగా నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరో సీనియర్ అధికారిణి శ్రీలక్ష్మి ఉన్నా ఆమెను నియమిస్తే రాజకీయ పరమైన విమర్శలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందుకే జగన్ టీటీడీ ఈవోగా ఉన్న జవహర్ రెడ్డిని సీఎంవో కార్యదర్శిగా నియమిస్తారని తెలిసింది. జవహర్ రెడ్డి అయితే అధికారులతో పాటు అందరినీ సమన్వయం చేసుకుని వెళ్లగలరని జగన్ భావిస్తున్నారని సమాచారం.
Next Story