Mon Dec 23 2024 06:17:30 GMT+0000 (Coordinated Universal Time)
పాలేరులో ఈక్వేషన్లు మారుతున్నాయా?
ఈక్వేషన్ల కారణంగానే షర్మిల పాలేరును ఎంచుకున్నారు. పైగా ఖమ్మం జిల్లాలో షర్మిల పాదయాత్రకు అనూహ్య స్పందన లభించింది.
వైఎస్ షర్మిల పాలేరు నుంచి పోటీ చేయడం ఖాయమయిపోయింది. ఈ విషయాన్ని షర్మిల స్వయంగా ఇటీవల ప్రకటించారు. ఇప్పటి నుంచే పాలేరులో పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను కొందరు నాయకులకు అప్పగించారు. ప్రజల్లో పట్టున్న ద్వితీయ శ్రేణి నేతలతో పాటు క్యాడర్ ను కూడా వైఎస్సార్టీపీ వైపు తిప్పుుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ నియోజకవర్గం నుంచి చేరికలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
పార్టీ అధినేతగా...
వైఎస్ షర్మిల పార్టీ చీఫ్ గా ఖచ్చితంగా గెలిచే స్థానాన్నే ఎంచుకోవాలి. తాను ఎన్నికల సమయంలో ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలంటే సులువుగా నెగ్గే నియోజకవర్గాన్ని పార్టీ అధినేతలు చూసుకుంటారు. అందులో భాగంగానే షర్మిల పాలేరును ఎంచుకున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా రెండు దఫాలు సర్వేలు చేయించిన తర్వాతనే ప్రకటన చేశారని పార్టీ వర్గాలు అంటున్నాయి. నమ్మకైన ఇద్దరు నేతలకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారని తెలుస్తోంది.
ఇద్దరు నేతలకు...
వారు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ ఇప్పటి నుంచే క్యాడర్ ను చేరదీసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ అధికార టీఆర్ఎస్ లో గ్రూపుల గోల ఉంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రస్తుత ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి వర్గాలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నాయి. ఈ నియోజకవర్గంలో కమ్యునిస్టుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. దీంతో పాటు కాంగ్రెస్ కూడా బలమైనదే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న ఒక కీలకనేత, అధికార పార్టీలో ఉన్న నేత ఒకరు లోపాయికారీగా షర్మిలకు సాయం చేేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది.
సీన్ ఇదే...
వీరిద్దరూ వైఎస్ కుటుంబం వల్ల లబ్ది పొందిన వారే కావడంతో వారు పాలేరులో తమకున్న పరిచయాలను షర్మిల పార్టీ వైపు మళ్లించేలా చేస్తున్నారట. ఇక్కడ ఎస్సీ నియోజకవర్గం ఓటర్లు ఎక్కువ. వీరంతా వైఎస్ పై అభిమానంతో షర్మిల వైపు నిలబడతారన్న అంచనాలు వినపడుతున్నాయి. ఎస్సీ ఓటర్లు ఎక్కువైనా తొలినుంచి రెడ్లదే ఆధిపత్యం. ఈసారి రెడ్డి సామాజికవర్గంలోనూ అత్యధికులు షర్మిలకు అండగా నిలుస్తారని చెబుతున్నారు. ఈ ఈక్వేషన్ల కారణంగానే షర్మిల పాలేరును ఎంచుకున్నారని తెలిసింది. పైగా ఖమ్మం జిల్లాలో షర్మిల పాదయాత్రకు అనూహ్య స్పందన లభించింది.
Next Story