Mon Dec 23 2024 07:53:38 GMT+0000 (Coordinated Universal Time)
ఈటలను అంత తేలిగ్గా వదులుతారా?
ఈటల రాజేందర్ బీజేపీలో చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. అందుకే ఈటలను దెబ్బతీయడానికి వరసగా నేతలను చేర్చుకుంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రేమ వచ్చినా అంతే. కసి ఉన్నా అంతే. అదే స్థాయిలో కనపరుస్తారు. ప్రేమ ఉంటే పదవులతో ముంచెత్తుతారు. తాను నమ్మితే ఇక అంతే ఆ నేతకు తిరుగులేదు. ఎన్ని తప్పులు చేసినా క్షమించేస్తారు. ఆ నేతను వెనకేసుకు వస్తారు. ఇక కసి ఉన్నా అంతే. దగ్గరకు కూడా రానివ్వరు. సమయం వచ్చినప్పుడు ఆ నేతను రాజకీయంగా మరింత దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంటారు. కేసీఆర్ ను దగ్గరి నుంచి చూసిన వారెవరికైనా ఈ విషయం తెలుసు. అందుకే గులాబీ బాస్ తో అంతగా అంగకాగరు. అలాగని దూరం కారు. బ్యాలన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ అనేక మంది నేతలు అలా బతికిపోతున్నారు.
ఎదిరించిన ఈటలను...
ఇక ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈటల రాజేందర్ తనను ఎదిరించాడు. అది కేసీఆర్ సహించలేకపోయారు. మంత్రి వర్గం నుంచి బర్త్‌రఫ్ చేసేశారు. అయినా ఈటల తగ్గలేదు. వెంటనే బీజేపీ కండువా కప్పుకున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై కాలుదువ్వాడు. దీంతో హుజూరాబాద్ లోనే ఈటలను ఓడించాలనుకున్న కేసీఆర్ కు ఆ కోరిక నెరవేరలేదు. ఎందరికో ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. ఇతర పార్టీ నేతలను తీసుకొచ్చి మరీ అందలం ఎక్కించారు. అయినా ఫలితం దక్కలేదు. చివరకు హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ దే పైచేయిగా మారింది.
సన్నిహిత సంబంధాలు...
పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఈటల రాజేందర్ కు ఇప్పటికీ కొందరు టీఆర్ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేయడంతో బీసీ నేతలతో ఈటలకు టీఆర్ఎస్ లోని నేతలతో వ్యక్తిగత సంబంధాలు కూడా ఉన్నాయి. మంత్రిగా ఉన్నప్పుడు వారికి ఏదో రకంగా పనిచేసిపెట్టడం, వారు నిర్వహించిన కార్యక్రమాలకు హాజరు కావడం వంటివి చేసి ఈటల వారికి చేరువయ్యారు. ఈ సంబంధంతోనే ఇటీవల మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిపోయారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బూర పార్టీని వీడటం ఇబ్బంది పెట్టింది. బీసీలు పార్టీకి వ్యతిరేకమవుతున్నారన్న ప్రచారం బూర పార్టీని వీడటంతో మరింత ఎక్కువయింది. దీని వెనక ఈటల రాజేందర్ ఉన్నారని కేసీఆర్ అనుమానిస్తున్నారు.
మెట్టుదిగి మరీ...
ఈటల రాజేందర్ బీజేపీలో చేరికల కమిటీ ఛైర్మన్ గా కూడా ఉన్నారు. అందుకే ఈటలను దెబ్బతీయడానికి వరసగా నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఒక మెట్టు కిందకు దిగైనా సరే.. తానే ఫోన్ చేసి వారిని స్వయంగా ఆహ్వానిస్తున్నారు. ఒకర్ని చేర్చుకుంటే ముగ్గురిని లాగేస్తాం అని వార్నింగ్ పంపుతున్నారు. బీజేపీలో ఉన్న బీసీ నేతలనే కేసీఆర్ టార్గెట్ చేశారు. అందుకే తనను వీడి వెళ్లిపోయిన స్వామి గౌడ్ కు ఫోన్ చేసి వెనక్కు రప్పించారు. మరికొందరు నేతలు కూడా లైన్ లో ఉన్నారని చెబుతున్నారు. ఈటల నాయకత్వంపై బీజేపీ హైకమాండ్ కు అనుమానం కలిగేలా ఆయన చేరికలను ప్రోత్సహిస్తున్నారు. అవసరమైతే వచ్చే వారికి పదవులు ఇచ్చేందుకు కూడా వెనకాడరు. ఇటు మునుగోడు ఉప ఎన్నికతో పాటు అటు ఈటలను దెబ్బకొట్టినట్లు అవుతుందన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది. మరి ఈరోజు, రేపు ఎవరు కేసీఆర్ లిస్ట్ లో ఉన్నారో అన్నది రాజకీయ పార్టీలతో పాటు ఈటలకు కూడా టెన్షన్ పట్టుకుంది.
Next Story