Mon Dec 23 2024 04:33:50 GMT+0000 (Coordinated Universal Time)
చావు వ్యాపారం.. రెండు వేల కోట్లు దాటుతుందట....?
మరణం కూడా భారత్ లో వ్యాపారంగా మారింది. బిజీగా ఉన్న బతుకులను సొమ్ము చేసుకునేందుకు కొందరు వెనకడాటం లేదు
మరణం కూడా భారత్ లో వ్యాపారంగా మారింది. బిజీగా ఉన్న బతుకులను సొమ్ము చేసుకునేందుకు కొందరు వెనకడాటం లేదు. వ్యాపారం చేసే వాళ్లది తప్పు కాదు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వ్యాపారాలు ఎక్కడైనా నిర్వహిస్తుంటారు. వ్యాపారాన్ని తప్పుపట్టలేం. తప్పు సమాజానిదా? వ్యాపారానిదా? అంటే సమాజానిదేనని చెప్పాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తల్లి, తండ్రి అంటే ప్రేమ అనేది కరువైంది.
మారుతున్న సమాజం...
ఎక్కడో పిల్లలు.. మరెక్కడో తల్లిదండ్రులు.. డబ్బులు సంపాదించడంలో బిజీగా మారిపోయిన నేటి కాలంలో సంప్రదాయాలను కూడా కాలరాస్తున్నారు. అమెరికాలోనో మరో దేశంలోనూ పిల్లలు. వృద్ధులైన తల్లిదండ్రులు ఇక్కడ. వారు కాలం చేస్తే కనీసం వచ్చి కర్మక్రియలు చేద్దామన్న ధ్యాస కూడా కొరవడుతుంది. సెలవులు లేవన్న కారణంతోనో, డబ్బులు ఖర్చు ఎందుకు అన్న ధోరణి ప్రబలి పోయి కొందరు కర్మకాండలకు కూడా నోచుకోవడం లేదు.
వ్యాపార సంస్థగా...
దీనినే కొందరు వ్యాపారంగా మలచుకుంటున్నారు. ఢిల్లీలో జరిగే ట్రేడ్ ఫెయిర్ లో ఈ దుకాణం వెలిసింది. సుఖాంత్ ఫ్యునరల్ ఎంజీఎంటీ ప్రవేట్ లిమిటెడ్ పేరుతో అంత్యక్రియలను నిర్వహించడానికి ఒక వ్యాపార సంస్థను ప్రారంభించారు. ఇందులో చేరాలంటే సభ్యత్వ రుసుము 37,500 రూపాయలు. ఈ మొత్తం చెల్లిస్తే అంత్యక్రియలన్నీ ఆ సంస్థ నిర్వహిస్తుంది. కుటుంబ సభ్యులతో ప్రమేయం లేకుండా కర్మకాండకు సంబంధించిన అన్ని ప్రక్రియలను పూర్తి చేస్తుంది. ప్రస్తుతం యాభై లక్షల రూాపాయల ఆదాయాన్ని ఆర్జించిన ఈ కంపెనీ వచ్చే ఏడాదికి ఈ కంపెనీ టర్నోవర్ రెండు వేల కోట్లు దాటుతుందని అంచనా.
ట్రేడ్ ఫెయిర్ లో....
అంత్యక్రియలను నిర్వహించడానికి అవసరమైన పూజారి, పాడె, అంతిమ యాత్రలో రామ్ రామ్ సత్య హై అంటు నినాదాలు చేసే వారిని కూడా ఈ సంస్థ సమకూరుస్తుంది. ఇదంతా ఒక ప్యాకేజీగా రూపొందించారు. చివరకు బూడిదను కూడా నదిలో నిమజ్జనం చేసే బాధ్యతను ఆ కంపెనీ తీసుకుంటుంది. ఈ కంపెనీకి పెద్దమొత్తంలో సభ్యులు చేరడం చూసి విచారించాలో? సంతోషించాలో తెలియడం లేదంటున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ట్రేడ్ ఫెయిర్ లో ఉన్న ఈ స్టాల్ ను చూసి కొందరు ఆశ్చర్యపోతుండగా, మరికొందరు చావు కూడా పెళ్లిలా మారిపోయిందంటున్నారు. ఈ స్టాల్ వద్ద తమ పేర్లను నమోదు చేసుకునే వారి సంఖ్యను చూసి నవ్వాలో? ఏడవాలో తెలియడం లేదు.
Next Story