Sat Nov 23 2024 02:32:17 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?
జనసేన పార్టీ పెట్టి ఇన్నేళ్లు అవుతున్నా ఆ పార్టీకి క్రమశిక్షణ సంఘం అంటూ ఏమీ లేదు.
జనసేన పార్టీని పవన్ కల్యాణ్ స్థాపించి దాదాపు ఎనిమిదేళ్లు కావస్తుంది. అయితే ఆ పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ లేరు. పవన్ కల్యాణ్ సోలోగానే పార్టీని ఇప్పటి వరకూ నడుపుకుంటూ వచ్చారు. తొలుత మాదాసు గంగాధరం, జేడీ లక్ష్మీనారాయణ వంటి నేతలు ఉండేవారు. తర్వాత నాదెండ్ల మనోహర్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే కీలక నేతలందరూ పార్టీ నుంచి వెళ్లిపోయారు. జిల్లాలో చెప్పుకోదగ్గ నేతలు ఎవరూ ఆ పార్టీకి లేరు. ఆ పార్టీలో ఎవరూ చేరలేదు. వీరు చేర్చుకోలేదు కూడా. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు ఎన్నికలు జరిగాయి.
కోవర్టులు ఎవరు?
2014లో జనసేన పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీకి మద్దతుగా నిలించింది. 2019 ఎన్నికల్లో కమ్యునిస్టులు, బీఎస్సీలతో కలసి కూటమి ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు వెళ్లింది. ఒక్క సీటు మాత్రమే వచ్చింది. ఆ సమయంలోనూ పార్టీలో పెద్దగా ఎవరూ చేరలేదు. అయితే ఈసారి జనసేనలో చేరికలు ఎక్కువగా ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధానంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నుంచి జనసేనలో చేరేందుకు నేతలు ముందుకు వస్తున్నారని చెబుతున్నారు. వివిధ నియోజకవర్గాల నుంచి నేతల నుంచి ప్రతిపాదనలను అందుతుండటంతో పవన్ కల్యాణ్ అప్రమత్తమయ్యారంటున్నారు. మరోవైపు ఉన్న నేతల్లో కొందరు కోవర్టులు ఉన్నారని పవన్ కల్యాణ్ అనుమానిస్తున్నారు.
అందుకేనా?
జనసేన పార్టీ పెట్టి ఇన్నేళ్లు అవుతున్నా ఆ పార్టీకి క్రమశిక్షణ సంఘం అంటూ ఏమీ లేదు. 2019 ఎన్నికల్లో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీ పంచన చేరిపోయారు. అయినా ఆయనపై చర్య తీసుకోలేదు. తాజాగా నిన్న జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కారణం చేరికలకు ఓకే చెప్పడానికేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చేరికలతో పార్టీలో కొంత ఊపు వస్తుందని జనసేన నేతలు నమ్ముతున్నారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీకైనా చేరికలు అవసరం. కానీ ఇప్పటి వరకూ చేరికలు లేవు. ప్రతిపాదనలు భారీగానే వస్తుండటంతో క్రమశిక్షణ సంఘాన్ని నియమించుకుందామన్న కొందరి నేతల సూచనకు పవన్ కల్యాణ్ ఒకే చెప్పినట్లు తెలిసింది.
ఓకే చెప్పేశారా?
అందుకే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీలో క్రమశిక్షణ సంఘాన్ని తాజాగా నియమించారు. అసలు నేతలు ఎవరున్నారని ఆయన ఈ సంఘం పెట్టారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. ఇప్పటి వరకూ అయితే ఆ అవసరం లేదు. ముందు ముందు అవసరాన్ని గుర్తించి ఆయన క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారంటున్నారు. దీనికి ఆయనే ఛైర్మన్ గా ఉంటారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు చేర్చుకుని నియోజకవర్గాల్లో బలపడాలన్న ప్రయత్నంలో పవన్ కల్యాణ్ ఉన్నారని సమాచారం. అందుకే ఆయన చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అందుకే క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేశారన్న టాక్ వినపడుతుంది.
Next Story