Mon Nov 25 2024 02:03:54 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ప్రయత్నం ఫలించిందా... ఇక అంతే
విశాఖ గ్లోబల్ సమ్మిట్ కు అంతా సిద్ధమయింది. నేటి నుంచి రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.
విశాఖ గ్లోబల్ సమ్మిట్ కు అంతా సిద్ధమయింది. నేటి నుంచి రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. విశాఖ నగరం ఇందుకు ముస్తాబయింది. రెండు లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ఈ సదస్సును ఏర్పాటు చేసింది. అడ్వాంటేజీ ఏపీ అన్న నినాదంతో ఈ సదస్సును ఏర్పాటు చేస్తుంది. కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అవగాహన ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమయింది. మొత్తం 16 రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఈ సదస్సును ఏర్పాటు చేయనుంది. కేంద్ర మంత్రులు కూడా పలువురు హాజరుకానున్నారు.
ఇండ్రస్ట్రియల్ పాలసీని...
పెట్టుబడిదారులకు ప్రోత్సాహకరమైన ఇండ్రస్ట్రియల్ పాలసీని ఈ నెలాఖరులో ప్రకటించనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా ఎన్నికల కోడ్ ఉన్నందున పారిశ్రామిక పాలసీని ప్రకటించే వీలు ఇప్పుడు లేదని చెబుతుంది. పరిశ్రమలకు 21 రోజుల్లోగా అన్నీ అనుమతులు ఇచ్చే విధంగా పాలసీని రూపొందించనున్నారు. పలు ప్రోత్సహకాలను కూడా ప్రకటించనున్నారు. ఈ సదస్సుకు మొత్తం 7,500 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దేశాల నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా పారిశ్రామిక వేత్తలు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.
అంబానీతో పాటు...
ఈ సదస్సుకు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, కుమారమంగళం బిర్లా, బజాజ్ , జిందాల్, ఒబెరాయ్,దాల్మియా,సెంచురీ భజాంక లాంటి పారిశ్రామికవేత్తలతో పాటు అనేక మంది రానున్నారు. విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్న పారిశ్రామిక వేత్తల ఛార్టెడ్ ఫ్లైట్ లను రాజమండ్రి విమానాశ్రయంలో పార్క్ చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల పాటు పారిశ్రామికవేత్తలు విశాఖలోనే బస చేస్తుండటంతో వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. స్టార్ హోటల్స్ ను ముందుగానే ప్రభుత్వం బుక్ చేసింది. ఆ హోటళ్లలో గదులన్నీ ప్రభుత్వం బుక్ చేసేసింది. సదస్సులకు వచ్చే ప్రతినిధుల కోసం మూడు వేల కిట్లను కూడా సిద్ధం చేశారు. ఏపీ గ్లోబల్ సమ్మిట్ కు వచ్చినట్లు గుర్తింపుగా మంచి బహుమతిని కూడా ప్రభుత్వం నుంచి ప్రతినిధులకు అందచేయనుంది.
మూడు రోజుల పాటు...
వైఎస్ జగన్ నిన్న సాయంత్రం విశాఖకు బయలుదేరి వచ్చారు. మంత్రులు రెండు రోజుల క్రితమే విశాఖకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, పారిశ్రామికవేత్తల భద్రత కోసం నాలుగు వేల మంది పోలీసులను నియమించారు. సదస్సుకు వచ్చే ప్రతినిధుల కోసం మొత్తం 130 స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో మొత్తం నాలుగు ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. వచ్చే అతిధుల కోసం సంప్రదాయమైన తెలుగు వంటకాలను రుచి చూపించనున్నారు. ఈ సదస్సు ద్వారా ఎంత పెట్టుబడులు వచ్చాయి? ఎంత విలువ కలిగిన అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నది వాస్తవ లెక్కలతో ప్రజల ముందు ఉంచుతామని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ తెలిపారు. మొత్తం మీద ఇటు సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ ముందంజలో ఉండాలన్న జగన్ ప్రయత్నం ఏమేరకు ఫలితాలనిస్తుందనేది వేచి చూడాల్సిందే.
Next Story