Fri Nov 22 2024 15:14:50 GMT+0000 (Coordinated Universal Time)
"మహా" మెలిక... షిండే కిరికిరి
కేబినెట్ కూర్పుపైనే ఏక్నాథ్ షిండేతో మాజీ ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవిస్ చర్చించారు.
మహారాష్ట్ర లో రాజకీయం ఇంకా చల్లారలేదు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయింది. ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, శివసేన రెబల్ ఎమ్మెల్యేల వర్గం నేత ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం రాజ్భవన్ లో ఈ ప్రమాణస్వీకారం ఉండనుంది. అయితే కేబినెట్ కూర్పుపైనే ఏక్నాథ్ షిండేతో మాజీ ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నవిస్ చర్చించారు. గోవాలో ఉన్న షిండేతో ఫడ్నవిస్ చర్చించినట్లు తెలుస్తోంది. రెబల్ గ్రూపు నుంచి పది మందికి మంత్రి పదవులు ఇస్తామని ఫడ్నవిస్ షిండేతో చెప్పారు.
ముఖ్యమైన శాఖలు...
అయితే షిండే వర్గంలో ఇప్పటికే ఉద్ధవ్ మంత్రి వర్గంలో మంత్రులుగా పనిచేసిన వారు ఆరుగురు వరకూ ఉన్నారు. వీరితో పాటు మరో నలుగురికి మాత్రమే అవకాశం కల్పిస్తామని ఫడ్నవిస్ చెప్పడంతో ఏక్నాథ్ షిండే అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తమ గ్రూపులో శివసేనతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారని వారిలో కొందరికి అవకాశమివ్వాలని కనీసం పదిహేను మందికి మంత్రి పదవులు ఇవ్వాలని షిండే అన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన శాఖలు కూడా తమకే ఇవ్వాలని షిండే వర్గం పట్టుబడుతున్నట్లు సమాచారం.
పది మందికి మించి....
బీజేపీ నుంచి 106 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరితో పాటు పన్నెండు మంది సభ్యుల మద్దతు బీజేపీకి ఉంది. వీరిలో ముఖ్యులైన వారికి కొందరికి మంత్రి పదవులను సర్దుబాటు చేయాల్సి ఉంది. దీంతో పది మందికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చే అవకాశముందని ఫడ్నవిస్ చెప్పినట్లు తెలిసింది. ముఖ్యమైన శాఖలు కూడా బీజేపీ, శివసేన రెబల్ వర్గాలకు సమానంగా పంచాలన్నది బీజేపీ ఉద్దేశ్యం. మరి షిండే పెట్టిన ఈ కొత్త మెలిక ఎటు వైపునకు దారితీస్తుందన్నది చూడాల్సి ఉంది.
Next Story