Mon Dec 23 2024 18:10:37 GMT+0000 (Coordinated Universal Time)
పొంగులేటి ఎఫెక్ట్ : బీఆర్ఎస్కు నష్టమేనా?
మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అధికార బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారారు.
మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అధికార బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులను కూడా ఆత్మీయ సమ్మేళనాల్లోనే ప్రకటిస్తూ వెళుతున్నారు. ఆయన ఏ పార్టీలో చేరుతున్నారన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయితే అన్ని పార్టీలూ తమ పార్టీలో చేరతాయని చెప్పుకుంటున్నాయి. ఆయన వైఎస్ విజయమ్మను ఇటీవల కలవడంతో వైఎస్సార్టీపీలో చేరతారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలను పూర్తి చేసుకుని అభ్యర్థులను ప్రకటిస్తూ వెళుతున్నారు.
అభ్యర్థులను ప్రకటిస్తూ...
పినపాక నుంచి పాయం వెంకటేశ్వర్లు, అశ్వా రావు పేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆది నారాయణ, వైరాలో విజయాభాయి వంటి వారి పేర్లను బహిరంగంగానే ప్రకటించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాదాపు ఐదారు నియోజకవర్గాల్లో తన సన్నిహితులను, తన వెంట ఉన్నవారిని బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు. తాను కొత్తగూడెం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పోటీ చేసి గెలుపే ముఖ్యం కాదు. బీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయించారు. ఎంత ఖర్చు చేసైనా సరే అధికార పార్టీని ఖమ్మం జిల్లాలో ముప్పతిప్పలు పెట్టాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు.
బీఆర్ఎస్ అధినాయకత్వానికి...
జిల్లాలో తన సత్తా ఏమిటో బీఆర్ఎస్ అధినాయకత్వానికి తెలిసి రావాలంటే ఐదారు నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఒకరకంగా బీఆర్ఎస్ కు తలనొప్పి అనే చెప్పాలి. ఎందుకంటే అధికార పార్టీ ఓట్లను మాత్రమే పొంగులేటి వర్గం చీల్చే అవకాశాలుండటంతో బీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యునిస్టు పార్టీలకు కూడా బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో బీఆర్ఎస్ అక్కడ గెలుపు నల్లేరు మీద నడక కాదు. అధికార పార్టీ ఓట్లనే అభ్యర్థులను బట్టి ఇతర పార్టీలు చీల్చుకునే అవకాశముంది.
నష్టం ఎవరికి?
అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకు జరిగిన అవమానాలతో పార్టీపై పగ తీర్చుకోవాలనుకుంటున్నట్లుంది. అందుకే ఆత్మీయ సమ్మేళనాలతో క్యాడర్ ను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. విందు సమావేశాలను ఏర్పాటు చేసి ఒక్కటి చేయాలన్న ప్రయత్నంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వైసీపీ నుంచి 2014లో ఎంపీగా గెలిచి టీఆర్ఎస్ లోకి వచ్చిన నాటి నుంచి తనను పట్టించుకోలేదని, అనేక అవమానాలకు గురి చేశారని, అందుకు తగిన మూల్యం బీఆర్ఎస్ చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో పొంగులేటి మాత్రం బీఆర్ఎస్ కు ఇబ్బందులు కలిగిస్తారనే చెప్పాలి. అంగ, ఆర్థిక బలాలున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో తన పట్టు ఏందో కేసీఆర్కు చూపించాలని కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story