Mon Dec 23 2024 10:30:13 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యన టీం సైలెంట్
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టీడీపీలో మళ్లీ పట్టు చిక్కింది. ఆయన తిరిగి పార్టీలో చక్రం తిప్పే అవకాశాలున్నాయి
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టీడీపీలో మళ్లీ పట్టు చిక్కింది. ఆయన తిరిగి పార్టీలో చక్రం తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా గంటా శ్రీనివాసరావు పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. నాలుగేళ్ల నుంచి పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంపై ఆయన రాజీనామా చేయడంతో తాను అసెంబ్లీకి రావడం లేదని సన్నిహితులు వద్ద చెబుతున్నారు. మరో వైపు నియోజకవర్గంలోనూ పెద్దగా యాక్టివ్ గా లేరు. దీంతో అయ్యన్న వర్గం విశాఖ జిల్లాలో ఇక తమకు తిరుగులేదని భావించింది. కానీ తిరిగి గంటా యాక్టివ్ కావడం, చంద్రబాబు అండ్ కో గంటాను దగ్గర తీయడంతో అయ్యన్న టీం సైలెంట్ అయింది.
పార్టీ మారతారని....
ఆయన పార్టీ మారతారని అందరూ భావించారు. వైసీపీలోకి వెళ్లాలని భావించినా అక్కడ అవంతి శ్రీనివాసరావు అడ్డుపడటంతో చేరిక ఆగిపోయిందనే విమర్శలు కూడా లేకపోలేదు. ఆ సంగతి అలా ఉంచితే... ఎన్నికలు దగ్గర పడే సమయంలో గంటా శ్రీనివాసరావు మరోసారి యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. నాలుగేళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయనకు టీడీపీలో పెద్దగా ప్రాధాన్యత ఉండకపోవచ్చని ఆయన ప్రత్యర్థులు భావించారు. ఉత్తరాంధ్రకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వెళ్లిన చంద్రబాబు సయితం గంటాతో ముభావంగా వ్యవహరించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.
పని అయిపోయిందని...
దీంతో టీడీపీలో గంటా శ్రీనివాసరావు పని అయిపోయిందని అనుకున్నారు. పార్టీలో ఆయన ప్రధాన ప్రత్యర్థి అయ్యన్నపాత్రుడు కూడా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల సంతృప్తికరంగా లేరు. అయితే కాపు సామాజికవర్గానికి చెందిన బలమైన నేత కావడం, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు మాజీ మంత్రి నారాయణకు వియ్యంకుడు కావడం, ఉత్తరాంధ్రలో బలమైన నేతగా భావించి గంటా శ్రీనివాసరావుకు తిరిగి ప్రాధాన్యత లభించడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో పాటు ఇటీవల జరిగిన గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఆయనను చంద్రబాబుకు మరింత చేరువ చేశాయంటున్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తొలుత ఒక మహిళను చంద్రబాబు ఎంపిక చేశారు. అయితే చివరి నిమిషంలో ఆమెను మార్చి చిరంజీవి రావు పేరును సూచించింది గంటా శ్రీనివాసరావు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాను గెలిపించుకువస్తానని కూడా చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అందుకే గంటా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాక్టివ్ అయ్యారు. పోలింగ్, కౌంటింగ్ జరిగే టప్పుడు కూడా అక్కడకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. తాను చెప్పిన వ్యక్తికే టిక్కెట్ ఇవ్వడం, ఆయన గెలవడంతో చంద్రబాబుకు గంటా శ్రీనివాసరావు మీద నమ్మకం మరింత పెరిగిందంటున్నారు. తాజాగా అనంతపురం జిల్లాకు వెళ్లి నారా లోకేష్ నుకూడా పాదయాత్రలో కలసి కొంతదూరం నడిచి వచ్చారు. ఆయన నుంచి కూడా హామీ పొందారని తెలిసింది. తేడా జరిగితే చిరంజీవి రావును కూడా తనతో వేరే పార్టీలోకి తీసుకెళ్లే అవకాశముండటంతో గంటాకు టీడీపీలో ఎలాంటి ఇబ్బందులు లేనట్లేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. గంటాకు ప్రయారిటీ ఉండదని భావించిన వారి ఆశలు అడియాసలేనని చెప్పక తప్పదు.
Next Story