Mon Dec 23 2024 17:48:22 GMT+0000 (Coordinated Universal Time)
లగడపాటిని లైన్ లో పెట్టేశారా?
వచ్చే ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసిందిటీడీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
లగడపాటి రాజగోపాల్.. అందరికీ సుపరిచితమైన పేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈయన పేరు వినని వారు ఉండరు. అయితే గత ఏడేళ్ల నుంచి లగడపాటి రాజగోపాల్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన ప్రకటించారు. ఆ మేరకు ఆయన ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసింది.
టీడీపీ నుంచి...
ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలిసింది. లగడపాటి రాజగోపాల్ ను గుంటూరు లేదా విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశముంది. విజయవాడ, గుంటూరు పార్లమెంటు స్థానాలకు కేశినేని నాని, గల్లా జయదేవ్ లు రెండుసార్లు వరసగా గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన వీరిద్దరూ మూడో సారి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.
గల్లాను అసెంబ్లీకి....
అయితే గుంటూరు నుంచి గల్లా జయదేవ్ ను మార్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. రాయపాటి కుటుంబానికి నరసరావుపేట పార్లమెంటు సీటు దాదాపు ఖరారయినట్లే. అయితే గల్లా జయదేవ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, యాక్టివ్ గా లేకపోవడం, పార్టీ క్యాడర్ లోనూ అసంతృప్తి ఉండటంతో ఆయనను మార్చాలని భావిస్తున్నారు. వీలుంటే గల్లా జయదేవ్ ను చంద్రగిరి అసెంబ్లీకి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయించారని తెలిసింది.
నానిని గుంటూరుకు పంపి....
అదే సమయంలో కేశినేని నాని కూడా మూడోసారి గెలవడం అంత సులువు కాదు. అందుకే కేశినేని నానిని గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించి లగడపాటి రాజగోపాల్ ను విజయవాడ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నారు. అప్పుడు రెండు స్థానాలు దక్కే అవకాశముందన్నది చంద్రబాబు అంచనా. అందుకే లగడపాటిని చంద్రబాబు ఇప్పటికే లైన్ లో పెట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. లగడపాటి రాజగోపాల్ కూడా తన శపథానికి పదేళ్లు పూర్తికావడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
Next Story