Thu Dec 19 2024 18:21:56 GMT+0000 (Coordinated Universal Time)
పొంగులేటి ఆ పెళ్లి వేడుక ఖర్చు ఎంతో తెలుసా?
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ నేడు జరగనుంది. ఈ వేడుకకు 10 లక్షల మంది హాజరు కానున్నారు
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ కు అంతా సిద్ధమయింది. నేడు జరిగే ఈ వేడుకకు పది లక్షల మంది హాజరవుతారని అంచనా. ఇందుకోసం భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. అతిధి మర్యాదల కోసమే 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు పొంగులేటి. ఖమ్మం లోని ఎస్ఆర్ గార్డెన్ లో జరగనున్న ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ముఖ్యులు హాజరవుతున్నారు. ఇక సాధారణ ప్రజలు దాదాపు మూడు లక్సల మంది హాజరవుతారని భావిస్తున్నారు.
మూడు లక్షల మందికి...
ఇందుకోసం వంటకాలను సిద్ధం చేశారు. 25 ఎకరాల్లో భోజనాల కోసం ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా, ప్రజల కోసం వేరొక చోట భోజన ఏర్పాట్లు చేశారు. 25 ఎకరాల్లో రిసెప్షన్ వేదికను ఏర్పాటు చేసిన పొంగులేటి కుటుంబం, వాహనాల పార్కింగ్ కోసం వంద ఎకరాలను సిద్ధం చేసింది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సొంత డబ్బులతో సాగర్ కెనాల్ పై రెండు స్టీల్ వంతెనలను కూడా నిర్మించడం విశేషం. ఇందుకోసం కోటి రూపాయలు వెచ్చించినట్లు తెలిసింది.
వివాహ రిసెప్షన్ కు...
ఈ నెల 12న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె పెళ్లి ఇండోనేషియా బాలిలో జరిగింది. ఈరోజు వివాహ రిసెప్షన్ ను ఖమ్మంలో ఏర్పాటు చేశారు. భారీ సెట్టింగ్ లు వేశారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ షెడ్లను నిర్మించారు. పెళ్లి ఆహ్వాన పత్రికతో పాటు ప్రతి ఇంటికీ గోడ గడియారాలను పంపిణీ చేశారు. పెళ్లి వేడుకకు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ఈ పెళ్లి వేడుకకు ఇంత ఖర్చు చేయడం అవసరమా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ సొమ్మును పేదలను ఆదుకునేందుకు ఉపయోగిస్తే బాగుంటుందన్న సూచనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఖమ్మం జిల్లా చరిత్రలో నిలిచిపోయేలా పొంగులేటి కుమార్తె వివాహ రిసెప్షన్ నేడు జరగనుంది.
Next Story