Mon Dec 23 2024 18:13:19 GMT+0000 (Coordinated Universal Time)
రాయపాటి మళ్లీ రచ్చ చేస్తాడా ఏంది?
రాయపాటి సాంబశివరావు ఇప్పుడు చంద్రబాబుకు కొత్త సమస్య తెచ్చి పెడుతున్నారు. ఇది చివరకు టీడీపీ అధినేతకు తలనొప్పిగా మారనుంది.
కొందరు నాయకులుంటారు. వారి నోటికి అందరూ భయపడాల్సిందే. అలాంటి లీడర్లకు సంతోషం వచ్చినా పట్టలేం. ఆగ్రహం కలిగినా ఆపలేం. అలాంటి వారిలో రాయపాటి సాంబశివరావు ఒకరు. తమకు నచ్చకుంటే నిర్మొహమాటంగానే చెప్పేస్తారు. పార్టీ అగ్రనేతలు బాధపడతారనీ ఆలోచించరు. తాము అనుకున్నది అనుకున్నట్లుగా బయటకు కక్కేస్తారు. అలాగే తాము అనుకున్నది జరగకపోతే వెంటనే నెగిటివ్ కామెంట్స్ చేయడానికి కూడా వెనకాడరు. పార్టీ నాయకత్వాన్నే ప్రశ్నించడంలో రాయపాటి ముందుంటారు.
బాబుకు తలనొప్పి...
అలాంటి రాయపాటి సాంబశివరావు ఇప్పుడు చంద్రబాబుకు కొత్త సమస్య తెచ్చి పెడుతున్నారు. ఇది చివరకు టీడీపీ అధినేతకు తలనొప్పిగా మారనుంది. నరసరావుపేట పార్లమెంటు స్థానం వేరే వాళ్లకు ఇస్తే ఒప్పుకోమని చెప్పారు. తను చెప్పిన వాళ్లకు ఇవ్వకుంటే తమ వర్గం సహకరించదని ఆయన తెగేసి చెప్పారు. బీసీ కార్డులంటూ కడప జిల్లాల నేతలను ఇక్కడ దిగుమతి చేస్తే ఒప్పుకునేది లేదని ఆయన ఒకరకంగా హెచ్చరికలు పంపారు. అవసరమైతే తానే పోటీ చేస్తాను తప్పించి ఇతరులకు తమ స్థానాన్ని ఇచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పారు.
మూడు అసెంబ్లీ సీట్లు...
ిఇక ఆయన మొత్తం మూడు అసెంబ్లీ సీట్లు కోరారు. ఒకటి తన కుమారుడికి. మరొకటి తన కుమార్తెకు రెండు సీట్లు ఇవ్వాలని రాయపాటి గతంలోనే చంద్రబాబును కోరారు. సత్తెనపల్లి అడిగితే ఇంతవరకూ చంద్రబాబు అక్కడ ఇన్ఛార్జిని కూడా నియమించలేదు. ఒక కుటుంబానికి ఒకే సీటు అన్న డిసెషన్ చంద్రబాబు తీసుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కేఈ, పరిటాల, జేసీ వర్గాలకే ఈ విషయం స్పష్టం చేశారని రాయపాటి విషయంలో పెద్దగా పట్టించుకోకపోవచ్చు. టీడీపీలో నమ్మకంగా ఉన్న కేఈ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే సీటు ఈసారి ఇవ్వనున్నారు. అదీ పత్తికొండ సీటు ఒక్కటే కేఈ శ్యాంబాబుకు ఇవ్వనున్నారు. మిగిలిన వారికి నో ఛాన్స్ అని చెప్పేశారు.
ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్....
తాడికొండ సీటును తోకల జనార్థన్ రావుకు ఇవ్వాలని కూడా రాయపాటి మెలిక పెట్టారు. అంటే మొత్తం మూడు సీట్లను రాయపాటి కోరుతున్నట్లు. అయితే వీటిలో ఒక్క సీటు మాత్రం రాయపాటి కుటుంబానికి గ్యారంటీ అంటున్నారు. అదీ రాయపాటి శ్రీనివాస్ కు మాత్రమే ఇస్తారన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. ఆ సీటు కూడా సత్తెనపల్లి కాకపోవచ్చంటున్నారు. పొత్తులన్నీ కుదిరిన తర్వాత గుంటూరు జిల్లాలోనే ఒక సీటు మాత్రం రాయపాటి కుటుంబానికి చంద్రబాబు ఖరారు చేస్తారు. అయితే ఇందుకు ఆయన ఒప్పుకుంటారా? ఎన్నికల సమయంలో రచ్చ చేయరూ? అన్న ఆందోళన గుంటూరు జిల్లా టీడీపీ నేతల్లో వ్యక్తమవుతుంది. మరి రాయపాటి ఏం చేస్తారన్నది ఆసక్తికరమైన అంశమే.
Next Story