Thu Dec 19 2024 06:50:48 GMT+0000 (Coordinated Universal Time)
రేణుకంటే వణుకే.. కానీ?
మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి గుడివాడలో పోటీ చేస్తానని ప్రకటించారు. ఇటు ఖమ్మంలోనూ పోటీకి సిద్ధమయ్యారు
అప్పుడెప్పుడో పుష్కరకాలం క్రితం.. అదీ ఎన్టీఆర్ పుణ్మమా అని లైమ్లైట్ లోకి వచ్చారు రేణుకా చౌదరి. నాడు ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరొందారు. ఆ కాలంలో మహిళలు సవాళ్లు చేయడం క్రేజ్ గా మారింది. దీంతో రేణుకా చౌదరికి రాజకీయంగా మంచి హైప్ వచ్చింది. తెలుగుదేశం పార్టీలో చాలా కాలం కీలకంగానే పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరినా ఆమె హవా తగ్గలేదు. దేవగౌడ కేబినెట్ లో కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. రెండు సార్లు కేంద్రమంత్రి పదవిని, రాజ్యసభ పదవినీ పొందారు. ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి గెలిచారు.
ఇప్పుడు రాజకీయాల్లో...
కానీ గతం వేరు. ప్రస్తుతం సీన్ వేరు. ఆమెకు ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలలో గెలిచింది లేదు. మాటలు తప్పించి చేతలు తక్కువగా రేణుకా చౌదరి తయారయ్యారన్న విమర్శలున్నాయి. సొంత పార్టీలోనే ఆమెను వ్యతిరేకించేవారు అధికమయ్యారు. ఇటీవల కాలంలో కొత్త జనరేషన్ లీడర్స్ రావడంతో రేణుక అవుట్ డేటెడ్ లీడర్ గానే మారిపోయారు. ఆమెను మించి ఫైర్ బ్రాండ్లు పొలిటికల్‌గా పుట్టుకురావడంతో రేణుకను పాపం పట్టించుకునే వారే కరవయ్యారు. ఖమ్మం జిల్లలో రేణుకను సమర్థించే వారికన్నా వ్యతిరేకించే వారే అధికంగా ఉన్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు.
రెండు చోట్ల...
రేణుకా చౌదరి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర రెండుచోట్ల పోటీ చేస్తామంటున్నారు. పోటీ చేయడానికి ఎవరూ తప్పు పట్టరు. ఎందుకంటే ఎవరు ఎక్కడైనా పోటీ చేసే వీలుంది. రేణుకా చౌదరికి ఇస్తే గిస్తే కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంటు సభ్యురాలిగానే బరిలోకి దింపుతుంది. అదీ ఖమ్మం నియోజకవర్గానికే బీ ఫారం ఇస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వదు. లోక్‌సభ ఎన్నికలు, ఏపీ ఎన్నికలు 2024లో ఒకేసారి జరుగుతాయి. ఇక ఆమె ఇటీవల తాను ఏపీ నుంచి కూడా పోటీ చేస్తానని కూడా తనకు తానే స్వయంగా ప్రకటించుకున్నారు.
రెండు చోట్ల పోటీకి...
ఒకేసారి జరుగుతున్న ఎన్నికల్లో అదీ కాంగ్రెస్ నుంచి రెండు రాష్ట్రాల నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ అధినాయకత్వం అనుమతిస్తుందా? అంటే సందేహమే. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఒకచోట గెలిస్తే చాలనుకుంటుంది. అందులో ఏపీలోని గుడివాడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించేశారు. గుడివాడలో రేణుక వెళ్లి చేసిందేమిటన్న ప్రశ్న తలెత్తుంది. అక్కడ వైసీపీ, టీడీపీ బలంగా ఉన్నాయి. కాంగ్రెస్‌కి ఏపీలో ఏమాత్రం అవకాశం లేదు. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రలో ఒకేసారి పోటీ చేసి సాధించేదేమిటో ఆమే చెప్పాలి. తనను గుడివాడలో పోటీ చేయాలని కొందరు వత్తిడి తెస్తున్నారట. అందుకే పోటీ చేస్తానంటున్నారు.
బలమైన అభ్యర్థులు లేరనే....
అయితే ఇక్కడ ఒకటి మాత్రం నిజం. ఏపీ కాంగ్రెస్ లో బలమైన అభ్యర్థులు లేరు. సో.. అక్కడ నామమాత్రంగా పోటీ చేసినా ఎవరూ అభ్యంతరం చెప్పకపోవచ్చు అనేవారు కూడా లేరంటున్నాయి పార్టీ వర్గాలు. మాటలు కోటలు దాటతాయి కానీ రేణుక వెళ్లి ఏపీలో చేసేదేందన్న ప్రశ్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏమో ఆమె ఇష్టం. హైకమాండ్ నిర్ణయం. పోటీ చేస్తే చేయవచ్చు. గుడివాడ బరిలో హస్తం తరుపున బరిలోకి దిగవచ్చు. కానీ అక్కడా, ఇక్కడా ఓటమి పాలయి మళ్లీ ఇంటికే పరిమితమవడం ఎందుకన్న ప్రశ్న ఆమె సన్నిహితుల నుంచి ఎదురవుతుంది. ఏదైనా మాటలు అన్నంత తేలిక కాదు.. చేతల్లో చూపించడం. మరి రేణుక ఎన్నికల నాటికి ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.
Next Story