Wed Dec 25 2024 04:44:18 GMT+0000 (Coordinated Universal Time)
ఎలక్షన్ కేబినెట్ ఇదేనా?
ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణ మరోసారి హాట్ టాపిక్ అయింది. కేబినెట్ మీట్ లో సీఎం జగన్ స్వయంగా చెప్పడం విశేషం
ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణ మరోసారి హాట్ టాపిక్ అయింది. కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చెప్పడంతో వైసీపీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. అయితే విస్తరణ ఎప్పుడు ఉంటుందనేది జగన్ చెప్పక పోవడంతో అనేక ఊహాగానాలు ఉన్నాయి. ఉగాది నాటికి విస్తరణ ఉంటుందని కొందరు, జూన్ తర్వాత మూడేళ్లు పూర్తయిన తర్వాతనే ఉంటుందని మరికొందరు చెబుతున్నారు.
ప్లీనరీలోపే...
అయితే వైసీపీ ప్లీనరీ లోపే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్నది మాత్రం వాస్తవం. ఈ నెల 15న వైసీపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో 90 శాతం మందిని తొలగించడం గ్యారంటీ అంటున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా, సామాజికవర్గాల వారీగా కసరత్తులు చేసిన జగన్ పూర్తి స్థాయి విస్తరణకు రెడీ అవుతున్నారు.
కొందరికి మాత్రం....
ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న వారిలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని వంటి వారికి కొనసాగింపు ఉంటుందని చెబుతున్నారు. మిగిలిన వారందరికీ ఉద్వాసన ఖాయమని జగన్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అంటే 19 మంది మంత్రుల్లో నలుగురు తప్ప 15 మంది సర్దుకోవాల్సిందే. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయనున్నారు. ఈ కేబినెట్ ఎన్నికల కేబినెట్ కాబట్టి బలమైన నేతలకు మంత్రి వర్గ బాద్యతలను అప్పగించే ఆలోచనలో జగన్ ఉన్నారు.
పార్టీని గెలిపించే బాధ్యత.....
ప్రస్తుతం ఉన్న మంత్రులకు జిల్లా బాధ్యతలను అప్పగించి వారికి పార్టీ బలోపేతం చేయడానికి వినియోగిస్తారు. కొత్తగా వచ్చే మంత్రులు, జిల్లా ఇన్ ఛార్జులుగా నియమితులైన మాజీ మంత్రులు కలసి పార్టీని వచ్చే ఎన్నికల్లో గట్టెక్కించాల్సి ఉంటుంది. అయితే ఈసారి సీనియర్లకు జగన్ అవకాశమిస్తారా? లేక ఎన్నికల కేబినెట్ కాబట్టి యువకులకు ప్రాధాన్యత ఇస్తారా? అన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద జగన్ మంత్రి వర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్నారు. ఎవరు ఇన్? ఎవరు అవుట్? అన్నది తేలాల్సి ఉంది.
Next Story