Sat Nov 23 2024 02:58:41 GMT+0000 (Coordinated Universal Time)
ఆనంను ఆపలేరు - గంటాను గెంటేయలేరు
గంటా శీనివాసరావు యాక్టివ్ కావడం, ఆనం టీడీపీలోకి వచ్చే అవకాశాలు కనపడుతుండటం చర్చనీయాంశమైంది.
2019 ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత చంద్రబాబు తరచూ పార్టీ నేతలతో జరిగే సమావేశాల్లో ఒక మాట చెప్పేవారు. పార్టీ కోసం కష్టపడిన వారికే మళ్లీ టిక్కెట్లని, కష్పపడకపోయినా, పార్టీ కార్యక్రమాలను సజావుగా చేపట్టకపోయినా టిక్కెట్ ఇచ్చేది లేదని పదే పదే చంద్రబాబు చెప్పేవారు. ఎందుకంటే కరోనాతో దాదాపు రెండేళ్లు ప్రజలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కరోనా తగ్గిన తర్వాత కూడా అనేక మంది నేతలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. ఖర్చుకు భయపడి కావచ్చు. అధికార వైసీపీ పెట్టే అక్రమ కేసులకు భయపడి కావచ్చు. కారణాలేదైనా మొన్నటి వరకూ కొందరు నేతలు దూరంగానే ఉన్నారు.
పదే పదే వార్నింగ్ లు...
చంద్రబాబు మాత్రం నియోజకవర్గాల సమీక్షల్లోనూ, జిల్లాల పర్యటనల్లోనూ నేతలను పదే పదే హెచ్చరించేవారు. కేంద్ర పార్టీ ఇచ్చిన నివేదికల ప్రకారం ఆయన అనేక మంది నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో పాటు నలభై శాతం మందికి యువతకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడల్లా చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావించేవారు. కానీ చంద్రబాబు వీక్నెస్ నేతలకు తెలియంది కాదు. గత దశాబ్దాలుగా ఆయనను దగ్గర నుంచి చూస్తున్న నేతలయిపాయె. తమకు తప్ప చంద్రబాబు ఇంకెవ్వరికీ టిక్కెట్ ఇవ్వరన్న ధైర్యం కావచ్చు. అందుకే కొందరు సీనియర్ నేతలు కూడా లైట్ గా తీసుకున్నారు. అంద ప్రధానంగా వచ్చే ఎన్నికలకు పెద్దమొత్తంలో ఖర్చు చేయాల్సి రావడం, గత ఎన్నికల్లో చేసిన ఖర్చు నుంచి కోలుకోకపోవడంతో నేతలు కొందరు పార్టీ కార్యక్రమాలను పెద్దగా చేపట్టలేదనే చెప్పాలి.
గంటా మూడేళ్ల పాటు...
ఏదో కోస్తా జిల్లాలు మినహాయించి ఎక్కడా టీడీపీ నేతల అలజడి పెద్దగా కనిపించలేదు. గత ఆరు నెలల నుంచే నేతలు బయటకు వస్తున్నారన్నది కూడా వాస్తవం. అదే సమయంలో ఇప్పుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంశం చర్చనీయాంశమైంది. గంటా దాదాపు మూడేళ్ల పాటు పార్టీ కార్యాలయానికి కూడా రాలేదు. అసెంబ్లీకి తొలి రోజుల్లో వచ్చినా మౌనంగా ఉండేవారు. తర్వాత విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరణకు నిరసనగా రాజీనామా చేశారు. విశాఖ ఉక్కు సమస్యపై పల్లా శ్రీనివాసరావు ఆమరణదీక్షకు దిగినా అటు వైపు గంటా చూడలేదు. అంతెందుకు చంద్రబాబు, లోకేష్ లు వెళ్లినా ఆయన లైట్ గా తీసుకున్నారంటారు. తాను గెలిచిన నియోజకవర్గంలో కూడా పెద్దగా పర్యటించలేదు. అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టి ఇన్నాళ్లూ లాగించేశారు. కానీ సడెన్ గా గంటా ఎంట్రీ ఇచ్చారు. లోకేష్ తో సమావేశమయ్యారు.
మళ్లీ యాక్టివ్ కావడంతో...
లోకేష్ నుంచి ఎలాంటి హామీ లభించిందో ఏమో తెలియదు కాని గంటా మళ్లీ యాక్టివ్ అయ్యారు. అయితే దీనిపై సొంతపార్టీలోని ఆయన ప్రత్యర్థి అయ్యన్న పాత్రుడు ఫైర్ అయ్యారు. పార్టీ కష్టకాలంలో ఉన్న గంటా ఇప్పుడు రావడమేంటి? ఆయనెవడండీ? ఆయనమైనా ప్రధానా? అని అయ్యన్న ప్రశ్నించాడు. కానీ చంద్రబాబు మాత్రం గంటాను గెంటేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే గెలుపు గుర్రాలను ఆయన ఎంపిక చేయాల్సి ఉంది. మరోవైపు గంటా కాపు సామాజికవర్గానికి చెందిన నేత. ఆయన కోరుకున్న చోట టిక్కెట్ దక్కకపోయినా ఏదో ఒక టిక్కెట్ టీడీపీ అధినేత ఇస్తారన్న నమ్మకం ఆయనకు ఉంది. అందుకే మూడేళ్ల పాటు అన్నింటికీ దూరంగా ఉన్నా ఇప్పుడు పార్టీలో యాక్టివ్ అవుతానని చెప్పినా అధినేత కాదనే పరిస్థితి లేదన్నది కాదనలేని వాస్తవం.
ఆనంకు రెడ్ కార్పెట్...
ఇక మరోవైపు ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆయనకు పొగ పెట్టేశారు. ఆనం వేరే పార్టీ చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆనం కూడా తక్కువ స్థాయి రాజకీయ నేత కాదు. అంగ, అర్థబలం ఉన్న నేత కావడంతో ఆయన టీడీపీలోకి వస్తామంటే రెడ్ కార్పెట్ పర్చడం ఖాయమని అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు ఆయన పార్టీ వీడి వెళ్లినా మరోసారి కండువా కప్పేందుకు సిద్ధంగా ఉంటారు. మరి ఈ మూడేళ్లు అక్కడ కష్టపడిన వారి పరిస్థితి అని అడిగితే అధికారంలోకి వస్తే వారికి ఏదో ఒక పదవి ఇస్తామని చెప్పడం మినహా చంద్రబాబు వద్ద నుంచి మరో ఆన్సర్ రాదు. ఇటు తాను తొలుత వార్నింగ్ ఇచ్చినట్లుగా గంటాను గెంటేయలేరు. అటు ఆనం ను పార్టీలోకి రాకుండా ఆపనూ లేరు. ఎందుకంటే గెలుపు ముఖ్యం. ఎన్నికల్లో అదే అవసరం కనుక ఎవరైనా సత్తా ఉన్నవోడికి పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇది చంద్రబాబు స్కూలు. అర్థం చేసుకున్నోడికి తెలుసు. కాకుండా ఉన్న వాళ్లను ఏమీ చేయలేం.
Next Story