Fri Nov 22 2024 23:36:00 GMT+0000 (Coordinated Universal Time)
ఫేక్ ఆధార్ కార్డు ముఠా గుట్టు రట్టు.. 8 మంది అరెస్ట్
నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి..జనాలకు అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 8 మంది సభ్యులతో కూడిన ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు.
ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఆధార్ కార్డే ఆధారమయ్యింది. పెన్షన్, బ్యాంక్ అకౌంట్, వ్యాక్సినేషన్, రుణాలు ఇలా చాలా వాటికి ఆధార్ కార్డుతోనే పని. అలాంటి ఆధార్ కార్డుల కోసం జనాలు నానా ఇబ్బందులు పడుతుంటారు. కొత్తకార్డుల కోసం అక్కడా.. ఇక్కడా తిరిగి తిరిగి వేసారిపోతున్నారు. అలాంటి వారిని నకిలీ ఆధార్ కార్డుల ముఠా మోసం చేస్తోంది. వేలల్లో డబ్బులు వసూలు చేసి.. నకిలీ ఆధార్ కార్డులు చేతులో పెడుతున్నారు ఈ కేటుగాళ్లు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి..జనాలకు అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 8 మంది సభ్యులతో కూడిన ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా ఈ ముఠా నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తోంది.
3 వేలమందికి నకిలీ ఆధార్ లు
నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆధార్ కార్డులు తయారు చేస్తున్న 8 మందిని నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అంజనీకుమార్. సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 8 మందిని అరెస్ట్ చేయగా.. మధ్యప్రదేశ్ వాసి అయిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి ఆధార్ కిట్స్, స్టాంప్స్, ఆధార్ కార్డ్ ఫామ్స్, ఫోర్జరీ బర్త్ సర్టిఫికేట్, ఫేక్ ఆధార్ కార్డ్, 80 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ముఠా జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసి సర్టిఫికెట్స్ ఫోర్జరీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటివరకూ వీరంతా కలిసి మూడు వేల మందికి ఆధార్ కార్డులు జారీ చేసిందని, ఒక్కొక్కరి వద్ద నుంచి కార్డుకు రూ.1000 నుంచి రూ.2000 వరకూ వసూలు చేసినట్లు తెలిపారు.
Next Story