కుటుంబ గొడవలు తట్టుకోలేకే అసెంబ్లీ రద్దు
అసెంబ్లీ రద్దు ద్వారా తెలంగాణకు పట్టిన పీడ విరగడ అయ్యిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఐదేళ్లు పరిపాలించేందుకు ప్రజలు అధికారం ఇస్తే అర్థంతరంగా ఎందుకు విరమించుకున్నారో కేసీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముందస్తు ఎన్నికల వల్ల ప్రజలపై 40 వేల కోట్ల భారం పడనుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ టీఆర్ఎస్ నిలబెట్టుకోలేదని, అటువంటిది ఐదు లక్షల 70 వేల కోట్ల బడ్జెట్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్లలో రాష్ట్రానికి 69 వేల కోట్లు అప్పు చేస్తే ఐదేళ్లలో కేసీఆర్ 1 లక్ష 60 వేల కోట్లు అప్పు చేశారు. కాంగ్రెస్ పై విమర్శలు చేసే ముందుకు కేసీఆర్ కు రాజకీయంగా బతుకును ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు.
ఇది విముక్తి దినం..!
సరైన సమయంలో ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా కూడా రాదనే ముందస్తుకు వెళ్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా దొంగలని, వారెవరూ మళ్లీ గెలవరని జోస్యం చెప్పారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికల గురించి ఆలోచిస్తుంటే... కాంగ్రెస్ పార్టీ ముందు తరాల ప్రజల కోసం ఆలోచిస్తుందన్నారు. తెలంగాణకు సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభిస్తే రెండోపారి సెప్టెంబర్ 6న కేసీఆర్ నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిందని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబంలో ముఖ్యమంత్రి పదవి కోసం కొట్లాట జరుగుతుందని, ఆ గొడవ భరించలేకే అసెంబ్లీని రద్దు చేశారని ఎద్దేవా చేశారు.