Mon Dec 23 2024 07:58:46 GMT+0000 (Coordinated Universal Time)
ఇక యాత్రలో రిస్క్ తప్పదా?
రాజధాని అమరావతి రైతులు అన్ని ప్రాంతాల మద్దతు కోరేందుకు మహాపాదయాత్రను ప్రారంభించారు. దాదాపు నెల రోజులు గడుస్తుంది.
రాజధాని అమరావతి రైతులు అన్ని ప్రాంతాల మద్దతు కోరేందుకు మహాపాదయాత్రను ప్రారంభించారు. దాదాపు నెల రోజులు గడుస్తుంది. ఇప్పటి వరకూ ఒక్క గుడివాడ మినహా మిగిలిన ప్రాంతంలో సాఫీగానే నడిచింది. గతంలో జరిగిని న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్రకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాలేదు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా సాగడంతో పెద్దగా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఎక్కడా ఆటంకాలు ఎదురు కాలేదు. నాలుగు జిల్లాలకు అమరావతికి దగ్గర కావడంతో ప్రజలు కూడా పాదయాత్రకు మద్దతు పలికారన్న భావన కలిగింది. పైగా అన్ని జిల్లాల్లో మద్దతు లభించిందనే భావించారు. అధికారంలో ఉన్న వైసీపీ నేతలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. రాజధాని రైతులు తమ హక్కుల కోసం ఈ పాదయాత్ర చేస్తున్నారని భావించారు.
ఈసారి అలా కాదు...
కానీ ఈసారి అమరావతి టు అరసవిల్లి మహా పాదయాత్ర అలా కాదు. కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల వరకూ ఇప్పుడు కూడా ఓకే. కాని పాత విశాఖ జిల్లాల నుంచి కొంత ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో జరుగుతున్న యాత్ర ఇది. పైగా ఉత్తరాంధ్రకు పరిపాలన రాజధాని ప్రకటించారు. వికేంద్రీకరణకు అనుకూలంగా రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పాదయాత్రకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలువడుతున్నాయి. అమరావతి పాదయాత్ర చేస్తున్న వారు రైతులు కాదని, రియల్టర్లంటూ ఆరోపణలు, విమర్శలు తీవ్రమయ్యాయి.
ఆ మూడు జిల్లాలు ఇబ్బందేనా?
దీంతో పాటు గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు దండిగానే వెలిస్తున్నాయి. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాల సవాళ్లు వినిపిస్తున్నాయి. కొత్తగా వికేంద్రీకరణకు అనుకూలంగా జేఏసీ ఉత్తరాంధ్రలో ఏర్పాటయింది. జేఏసీ ఆధ్వర్యంలో కార్యక్రమాలను కూడా రూపొందించేస్తున్నారు. విశాఖకు పరిపాలన రాజధానిగా ప్రకటిస్తే వీరు అడ్డుకోవడానికి ఈ యాత్రను చేస్తున్నారని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరగుతున్నాయి. అధికార పార్టీ అండదండలతో ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నా కొంత సీరియస్ గానే ఎఫెర్ట్ పెడుతున్నట్లే కనిపిస్తుంది. అలాగే రైతుల పాదయాత్ర వెనక కూడా టీడీపీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది.
పోటీ యాత్రలు..సమావేశాలు...
మరో వైపు ఉత్తరాంద్ర ప్రాంతంలో టీడీపీకి నేతలున్నా ఎమ్మెల్యేలు పెద్దగా లేరు. విజయనగరం జిల్లాలో అయితే టీడీపీలందరూ మాజీలే. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరే ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నారు. మాజీలున్న వారిలో యాక్టివ్ గా ఉన్నవారు కొందరే. పైగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పాదయాత్రను అడ్డుకుని తీరుతామని ఇప్పటికే ప్రకటించారు. తమ ప్రాంతంపై దండయాత్రగా పాదయాత్ర వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశముందని చెబుతున్నారు. పోటీ యాత్రలు, జేఏసీ మీటింగ్ లు, రాజీనామాల ప్రకటనలతో ఇప్పటికే ఉత్తరాంధ్ర హీటెక్కింది. ఈ పరిస్థితుల్లో ఆ మూడు జిల్లాల్లో మహాపాదయాత్రకు పోలీసులు ఎలాంటి రక్షణ కల్పిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు అధికార పార్టీ, మరోవైపు హైకోర్టు ఉత్తర్వులతో పోలీసులు నలిగిపోతున్నారనే చెప్పాలి. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Next Story