రైతన్నల ఆందోళనతో దద్దరిల్లిన ఢిల్లీ
తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు రైతన్నలు కదిలారు. లక్షలాధిగా దేశరాజధాని బాట పట్టారు. ఎన్నో కష్టాలు భరిస్తూ ఢిల్లీ శివారుకు చేరుకున్నారు. అయితే, రైతుల ర్యాలీపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రబ్బర్ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. వాటర్ కెనాన్లతో రైతన్నలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్ వద్ద తీవ్ర ఉదృక్తతలు నెలకొన్నాయి. దేశంలో రైతుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్ తో రైతు సంఘాల ఆధ్వర్యంలో గత నెల 23వ తేదీన హరిద్వార్ నుంచి వేలాది మంది రైతులతో ఢిల్లీకి కిసాన్ క్రాంతి ర్యాలీని ప్రారంభించారు.
న్యాయమైన డిమాండ్లతో
ఈ ర్యాలీ ఇవాళ ఉదయం ఘజియాబాద్ శివార్లకు చేరగా పెద్దసంఖ్యలో పోలీసులు వారిని బ్యారికెడ్లు అడ్డుపెట్టి నిలిపేశారు. వారిని చెదరగొట్టూందుకు రబ్బర్ బుల్లెట్లు, భాష్పవాయు గోళాలను, వాటర్ కెనాన్లను ప్రయోగిస్తున్నారు. దీంతో పలువురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా దేశవ్యప్తంగా రైతులకు రుణమాఫీ చేయాలని, అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని, ఫసల్ బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరుతున్నారు.