Mon Dec 23 2024 13:15:25 GMT+0000 (Coordinated Universal Time)
సాలిడ్ ఓటు బ్యాంకు అదేనా?
సమర్థత, విజన్ ఉన్న నేతల అవసరాన్ని కొద్ది మంది మాత్రమే గుర్తిస్తారు. అదే వచ్చే ఎన్నికలలోనూ జగన్ కు అనుకూలంగా మారనుంది
నిజంగా కావాల్సి వస్తే అభివృద్ధి గురించి ఎంత మంది ఆలోచిస్తారు? ఐదు కోట్ల మంది ప్రజల్లో ఐదు లక్షల మంది ప్రజలైనా అభివృద్ధి కోసం ఒక్క క్షణమైనా మనసు పెడతారా? తమకు ప్రభుత్వం నుంచి వస్తున్నదేంటి? ప్రభుత్వం నుంచి తాము లబ్ది పొందుతుందన్నది ఎంత? అన్నదే ఎక్కువ మంది ఆలోచించి ఎన్నికల సమయంలో నిర్ణయం తీసుకుంటారు. సమర్థత, విజన్ ఉన్న నేతల అవసరాన్ని బహుకొద్ది మంది మాత్రమే గుర్తిస్తారు. అదే వచ్చే ఎన్నికలలోనూ జగన్ కు అనుకూలంగా మారుతుందన్న విశ్లేషణలు వినిపిపిస్తున్నాయి.
బిజినెస్ మ్యాన్ గా...
నిజానికి జగన్ బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ అయి రాజకీయాలలో ఎలా సక్సెస్ అవుతారో అని అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. పరిపాలన అనుభవం లేమితో జగన్ ఇబ్బంది పడతారని భావించిన వారు కూడా లేకపోలేదు. కాని జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే రాటుతేలారు. సీఎం సీటుపై కూర్చున్న నాటి నుంచే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహరచన చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా ఓటు బ్యాంకును స్థిరపర్చుకునే ప్రయత్నంలోనే మూడేళ్లూ ఉన్నారు. జగన్ అనుకున్నట్లుగానే సంక్షేమ పథకాలు అమలులో రికార్డు సృష్టించారు.
ఆర్టీసీ ఉద్యోగులు...
మూడున్నర లక్షల కుటుంబాలకు నేరుగా లబ్ది చేకూర్చారు. వివిధ పథకాల కింద ఒక్కొక్క ఇంటికి ఇప్పటి వరకూ రెండు లక్షల నుంచి పది లక్షల వరకూ లబ్ది చేకూరేలా పథకాలను ప్రజల చెంతకు చేర్చారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ పథకాలను రద్దు చేస్తారన్నది వాస్తవం. అందుకే ఈ మూడున్నర లక్షల కుటుంబాలు వైసీీసీ వెంటనే ఉంటాయన్న అంచనా. మరోవైపు ఆర్టీసీని ప్రభుత్వ సంస్థగా మార్చారు. ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో దాదాపు లక్షన్నర కుటుంబాలు జగన్ వెంటే నడుస్తారన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వస్తే తిరిగి కార్పొరేషన్ గా మారిస్తే తమకు వచ్చే ఆ కొద్ది బెనిఫిట్ లు రావన్నది వారి అనుమానం.
విద్య, ఆరోగ్యం...
ఇక ఆరోగ్య శ్రీ కార్డులు, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాల కింద పేద, మధ్య తరగతి ప్రజలు లబ్ది పొందుతున్నారు. రానున్న రెండేళ్లలో మరింతగా సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లి మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న ప్రయత్నంలో జగన్ ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కొంత అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే. అయితే చంద్రబాబు వచ్చినా తమకు ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదన్న ధోరణిలో వారున్నారని చెబుతున్నారు. జగన్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క జీతభత్యాలు మినహా ఎలాంటి వత్తిడి లేకుండా విధులు నిర్వహించుకుంటున్నారు. అదే చంద్రబాబు వస్తే తిరిగి వత్తిడికి లోనవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల్లో అనేక మంది భావిస్తున్నారని కూడా వివిధ శాఖల ఉద్యోగుల మనోభావాలను బట్టి తెలుస్తుంది. మొత్తం మీద జగన్ కు కలసొచ్చే అంశాలను కాదని చంద్రబాబు గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.
Next Story