Sun Nov 17 2024 22:28:48 GMT+0000 (Coordinated Universal Time)
మము బ్రోవమని చెప్పవే... సీతమ్మ తల్లీ?
రానున్న ఆర్థిక సంవత్సరం కోసం రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు.
రానున్న ఆర్థిక సంవత్సరం కోసం రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్ కోసం అనేెక మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో నిర్మలమ్మ బడ్జెట్ ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. పన్ను రాయితీలు, వివిధ పథకాలుకు నిధులు, రాష్ట్రాలకు ఊరట కల్గించే నిర్ణయాలు ఈ బడ్జెట్ లో చోటు చేసుకుంటాయని లెక్కలు బాగానే వినపడుతున్నాయి. పేరుకు ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నా, మోదీ ఆలోచనల మేరకే దానిని రూపొందించారన్నది వాస్తవం.
ఆ ఐదు రాష్ట్రాలకు.....
అయితే గతంలో బడ్జెట్ లు చూసినప్పుడు కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. అతి పెద్దదైన ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ బడ్జెట్ లో ఈ ఐదు రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు. గతంలోనూ కేంద్ర బడ్జెట్ లో అప్పటి ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మోదీ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా వరాలు ప్రకటించింది. అనేక ప్రాజెక్టులను మంజూరు చేసింది. అలా బడ్జెట్ కు ముందు వచ్చిన ఎన్నికల్లో ఆ రాష్ట్రాలకు పెద్దపీట వేసి ఎన్నికల నుంచి గట్టెక్కడం మోదీకి కొత్తేమీ కాదు.
కోవిడ్ దెబ్బకు....
ఇప్పుడు కూడా అదే తరహాలో ఆ ఐదు రాష్ట్రాలకు ఎక్కువగా ప్రయోజనాలు ఉండే అవకాశముందంటున్నారు. నిర్మలా సీతారామన్ నాలుగోసారి బడ్జెట్ ను వరసగా ప్రవేశపెడుతున్నారు. కోవిడ్ తీవ్రతతో దేశ వ్యాప్తంగా అనేక రంగాలు కుదేలయ్యాయి. ఒక్క ఫార్మా రంగం తప్ప ఏవీ కోలుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లాయి. నిరుద్యోగం మరింత పెరిగింది. మరోవైపు ఆదాయపు పన్ను శాఖ మినహాయింపు విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని మధ్య తరగతి ప్రజలు భావిస్తున్నారు.
ఏ వర్గంలోనూ.....
విద్య, వైద్యరంగానికి పెద్దపీట వేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా బడ్జెట్ ఉండాలని కోరుకుంటున్నారు. చిన్న వ్యాపారులు అప్పులతో సతమతమవుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఇలా భారత్ లో ఒక్క సంపన్న వర్గం తప్ప ఏ వర్గమూ గత నాలుగేళ్లుగా సుఖంగా లేదు. సంతోషం అసలే లేదు. దీంతో కొన్ని వర్గాలకు ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పిస్తారన్న అంచనాలు వినపడుతున్నాయి. ఇక రైతు చట్టాలను వెనక్కు తీసుకున్న ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని రాయితీలను ప్రకటించే అవకాశముంది. మొత్తం మీద నిర్మలమ్మ బడ్జెట్ పైన ఎందరో ఆశలు పెట్టుకున్నారు. కానీ నిర్మలమ్మ ఈసారి ఎవరికి వరాలు ప్రకటిస్తారో? ఎవరి మీద పన్నుల భారం మోపుతారన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.
Next Story