Sun Nov 17 2024 20:22:24 GMT+0000 (Coordinated Universal Time)
ఏడింటికి బడ్జెట్లో ప్రాధాన్యత : నిర్మలా సీతారామన్
దేశం వృద్ధిరేటు శరవేగంగా పెరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్సభలో బడ్జెట్ నిర్మల ప్రవేశపెట్టారు
దేశం వృద్ధిరేటు శరవేగంగా పెరుగుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్సభలో బడ్జెట్ ను నిర్మల ప్రవేశపెట్టారు. అన్న వర్గాల వారిని ఈ ప్రభుత్వం ఆదుకునేందుకు ప్రయత్నిస్తుందని తెలపారు. 2024 వరకూ ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల అభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్ ను రూపకల్పన చేశామని తెలిపారు. రైతులు, మహిళలు, యువతకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధిని మరింత పెంచుతున్నామని తెలిపారు.
గ్రీన్ ఎనర్జీ రంగంలో...
వ్యవసాయరంగంతో పాటు దాని అనుబంధ రంగాలపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఉద్యాన, చిరు ధన్యాల ఉత్పత్తులకు చేయూతనందించాలని నిర్ణయించామని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో మరింత ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. వ్యవసాయ రంగంలో సవాళ్లు ఎదుర్కొనేందుకు కొత్త ప్రణాళికను రూపొందించుకుంటున్నామన తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయించనున్నామని, మత్స్యశాఖకు ఆరు వేల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.
వ్యవసాయ రంగానికి...
వ్యవసాయ పరపతి సంఘాలను డిజిటలైజ్ చేయనున్నట్లు చెప్పారు. సామాన్యుల సాధికాతే బడ్జెట్ లక్ష్యమని నిర్మలా సీతారామన్ వివరించారు. 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు చేయూతనందించేలా బడ్జెట్ ను రూపొందించామని చెప్పారు. ఏకలవ్య పాఠశాలలో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. యాభై ఎయిర్ పోర్టులు, పోర్టులను పునరుద్ధరించాలని నిర్ణయించామని తెలిపారు. జీ 20 అధ్యక్ష బాధ్యతలతో భారత్ కీలక పాత్రను పోషించనుందన్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ తో చేనేత వర్గాలకు ఊరట లభించిందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.
రైల్వే శాఖకు 2.40 లక్షల కోట్లు...
పీఎం ఆవాస యోజనకు 79 వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించామని చెప్పారు. రైల్వే శాఖకు 2.40 లక్షల కోట్లను కేటాయించామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కరువు ప్రాంత రైతులకు 5,300 కోట్లను నిధులను బడ్జెట్ లో పొందుపర్చామని చెప్పారు. 13.7 లక్షల కోట్ల వడ్డీ లేని వ్యవసాయ రుణాలను అందిస్తామని తెలిపారు. యువత కోసం నేషనల్ డిజిటలైజ్ లైబ్రరీలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. దళితుల అభివృద్ధికి పలు పథకాలను రూపొందించామని చెప్పారు. నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం అర్బన్ ఇన్ఫ్రా ఫండ్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఏడాదికి అర్బన్ ఇన్ఫ్రా ఫండ్ పదివేల కోట్లను కేటాయించనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
అమృతకాలంలో...
భారతదేశం ఆర్థికంగా నిలదొక్కుకుంటుందని చెప్పారు. అమృతకాలంలో ఇది తొలి బడ్జెట్ అని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశంలో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయన్న నిర్మల సమిష్టి ప్రగతి దిశగా భారత్ పయనిస్తుందని అభిప్రాయపడ్డారు. విశ్వకర్మ కౌశల్ పథకం కింద చేనేత కార్మికులను ఆదుకుంటున్నామని తెలిపారు. బడ్జెట్ లో మొత్త ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. 81 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ప్రోత్సహాకాలను అందిస్తున్నామని చెప్పారు. శ్రీ అన్న పథకం ద్వారా చిరు ధాన్యాలకు ప్రత్యేక చేయూతను అందిస్తామని చెప్పారు. ట్రాన్స్పోర్టు రంగానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. వ్యాపార సంస్థలకు ఇకపై పాన్ కార్డు ద్వారానే గుర్తింపు లభిస్తుందని చెప్పారు. పదిహేనేళ్లు దాటిన వాహనాలను చెత్త కింద మార్చేయాలని నిర్ణయించామని నిర్మలా సీతారామన్ చెప్పారు.
Next Story