Sat Nov 23 2024 00:11:29 GMT+0000 (Coordinated Universal Time)
"కన్నా" రోడ్డు మ్యాప్ ఖరారయినట్లే
బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారేందుకు సిద్ధమయినట్లే కనిపిస్తుంది.
ఎక్కడైనా అంతే.. ఎప్పుడైనా అంతే.. నెపం నెట్టడానికి సాకులు చూపుతుంటారు. కొందరు ముందుగానే సిద్దమయి అవకాశం కోసం చూస్తుంటారు. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా అంతే. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీ మారేందుకు సిద్ధమయినట్లే కనిపిస్తుంది. బీజేపీలో తనకు భవిష్యత్ లేదని భావించిన కన్నా లక్ష్మీనారాయణ జనసేన వైపునకు మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పై ఆయన గత కొంతకాలంగా చేస్తున్న బహిరంగ విమర్శలే ఇందుకు సంకేతాలని చెప్పొచ్చు.
నాదెండ్లతో కలసినప్పడే...
ఇటీవల జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణను కలసినప్పుడే కొంత అనుమానాలు రేపాయి. ఈ సమయంలో కన్నాను కలవాల్సిన పనేంటి? అన్న దానిపై బీజేపీలోనూ చర్చ జరిగింది. అయితే ఆయన జనసేనలోకి వెళతారన్న ప్రచారం అప్పటి నుంచే మొదలయింది. జనసేన, టీడీపీ కలసి పోటీ చేసే అవకాశాలున్నాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో తాను శాసనసభకు పోటీ చేయాలన్నా, అసెంబ్లీలో అడుగుపెట్టాలన్నా జనసేనలో చేరడం బెటర్ అని ఆయన భావిస్తున్నారు. గత కొంత కాలం నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు. తన ఇంటి ఎదుట బీజేపీ ఫ్లెక్సీలను కూడా తొలగించడం మరింత అనుమానాలకు తావిచ్చింది.
అందుకే తొలిగించారా?
కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడతారని ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఉఫ్పందంది. తనపై విమర్శలు చేసింది కూడా అందుకేనని సోము వీర్రాజు నమ్ముతున్నారు. అందుకే ఆయన హయాంలో నియమించిన జిల్లా అధ్యక్షులందరినీ తొలగించేందుకు సిద్ధమయ్యారు. దీనిని నిరసిస్తూ అనేక మంది తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. కోర్ కమిటీలో చర్చించకుండా అధ్యక్షులను ఎలా తొలగిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏకపక్షంగా సోము వీర్రాజు నిర్ణయం తీసుకుంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పవన్ కల్యాణ్ ను, తెలంగాణలో బండి సంజయ్ ను బలహీనపర్చే ప్రయత్నం జరుగుతుందన్నారు.
జనసేనలో చేరి...
కేసీఆర్, జగన్ కలసి కుట్రలు చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తన వియ్యంకుడు బీఆర్ఎస్ లో ఎందుకు చేరారో సోము వీర్రాజు చెప్పాలని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. అంతేకాదు ఒకడుగు ముందుకేసి తాను పవన్‌కు అండగా నిలబెడతామని కూడా అన్నారు. దీన్ని బట్టి కన్నా లక్ష్మీనారాయణ జనసేనలోకి వెళ్లే సమయం ఎంతో దూరం లేదన్నది అర్థమవుతుంది. జనసేనలో చేరి టీడీపీతో కలసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్నది కన్నా లక్ష్మీనారాయణ ఆలోచన అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కన్నా రాజకీయ రూట్ మ్యాప్ ఖరారయిందని, అందులో భాగంగానే ఆయన జనసేనకు దగ్గరగా, కమలం పార్టీకి దూరమవుతున్నారన్నది టాక్.
Next Story