Fri Nov 22 2024 19:41:41 GMT+0000 (Coordinated Universal Time)
ఎందుకు చేశారు ఈ పని?
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. ఆయన ఎందుకు చేరారన్న దానిపై చర్చ జరుగుతోంది.
ఏ పొలిటికల్ లీడరూ తమకంటూ సొంత ప్రయోజనం లేకుండా పార్టీని వీడరు. మరొక పార్టీ కండువా కప్పుకోరు. సిద్ధాంతాలను చూసి, అభివృద్ది చేస్తారని నమ్మి చేరాని చెప్పడం ట్రాష్. గతంలో ఎవరైనా అలాంటి రాజకీయ నేతలు ఉన్నారేమో కాని.. నేటి కాలంలో సిద్ధాంతాలను నమ్మి పార్టీలో చేరిన వాళ్లు లేరనే చెప్పాలి. ఇందుకు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అతీతుడు కాదు. ఆయనకు కాంగ్రెస్ ఎంతో చేసింది. హైకమాండ్ సూచనలు, సలహాలను తీసుకోలేదని చెబుతున్న నల్లారి నాడు తనను ముఖ్యమంత్రి చేయడానికి ఎవరు విన్నారు? ఎవరు తనవైపు చూశారన్నది తెలుసుకోవాలి. పార్టీని వీడి వెళ్లేటప్పుడు బురద జల్లడానికి తప్ప ఇలాంటి విమర్శలు దేనికీ పనికి రావు.
బీజేపీ కూడా...
రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్కు ఇక భవిష్యత్ లేదనే తాను పార్టీని వీడుతున్నానని ఆయన కండువా కప్పుకున్న సందర్భంలో చెప్పారు. మరి ఆరోజు ఈయన చేరిన బీజేపీ కూడా విభజనను సమర్థించలేదా? అన్న ప్రశ్నకు బహుశ ఆయన వద్ద సమాధానం ఉండదు. ఏదో ఒక సాకుతో వెళ్లిపోవాలనుకున్నారు. వెళ్లిపోయారు. అంతే తప్ప. మోదీ మీద ప్రేమతోనో, బీజేపీ దేశాభివృద్ధికి పాటుపడుతుందనో కాదన్నది మాత్రం యదార్ధం. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మామూలు రాజకీయ నేత కాదు. వైఎస్ మరణం తర్వాత సీనియర్ నేత రోశయ్యను పక్కన పెట్టి ముఖ్యమంత్రి కాగలిగాడంటేనే ఆయన సమర్థత, లౌక్యం, రాజకీయ చతురతను అర్థం చేసుకోవచ్చు. అలాంటి నల్లారి ఐదు దశాబ్దాల పాటు తన కుటుంబాన్ని గౌరవించిన కాంగ్రెస్పై ఇప్పుడు రాళ్లు వేసి వెళ్లడం కూడా సమర్థనీయం కాదు.
టీడీపీతో కలపడానికేనా?
నిజానికి ఆయన రాజకీయ కెరీర్ ఎప్పుడో ముగిసిందనే చెప్పాలి. ఎందుకంటే నల్లారి కుటుంబానికి పీలేరులోనే గత రెండు దఫాలుగా దిక్కులేదు. ఇప్పుడు బీజేపీలో చేరినా అక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తామన్న విశ్వాసం ఆయనకు కూడా ఉండి ఉండదు. ఇప్పుడు ఏపీ రాజకీయాలు మారిపోయాయి. విభజన అంశాలు పక్కన పెడితే పోటీ వైసీపీ, టీడీపీల మధ్యనే ఉంది. మరో పార్టీకి అవకాశం లేదు. అలాంటిది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో గెలిచి మరోసారి రాష్ట్ర పగ్గాలు చేపడతామన్న ఆశ ఆయనకు ఉండి ఉండదు. కాకుంటే ఒకే ఒక కోరిక. వచ్చేఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బీజేపీతో జతచేయించడం, తన సోదరుడిని మంత్రిని చేయడం అనంతరం చిరకాల ప్రత్యర్థి ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఎదుర్కొనడానికే బీజేపీలో చేరారన్నది వాస్తవమన్నది అందరికీ తెలిసిందే.
కాంగ్రెస్ అధికారంలోకి రాదని....
కేంద్రంలో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలో రాదన్న అంచనాలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల్లో పాగా వేయడం, కాంగ్రెస్ నాయకత్వాన్ని విశ్వాసంలోకి తీసుకోకపోవడంతో ఈసారి యూపీఏ అధికారంలో రాదని లెక్కలు వేసుకుని మరీ కాంగ్రెస్ను వీడారు. బీజేపీలో చేరారు. బీజేపీలో ఆయన ప్రయాణం సజావుగా జరుగుతుందన్న నమ్మకం లేదు. అక్కడ తొలి నుంచి ఉన్న నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ముంటుంది. ఈయన చేరిన వెంటనే పదవులు వచ్చి పడే అవకాశమూ లేదు. ఎందుకంటే ఎందరో నేతలు వెయిటింగ్ అక్కడ. ఆ విషయమూ ముఖ్యమంత్రిగా చేసిన నల్లారికి తెలియదని కాదు. కానీ కొన్ని లెక్కలు తేల్చాలంటే తాను ఒక గొంతుకగా మారాలి. టీడీపీతో జతకట్ట కలిగితేనే నాలుగు సీట్లు వస్తాయని బీజేపీ ఢిల్లీ పెద్దలను నమ్మించ కలిగితే తాను చేరిన ఫలితం దక్కినట్లే అని భావిస్తున్నారు.
మరొక చేరారు..
ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి టీడీపీతో పొత్తు విషయాన్ని పార్టీ పెద్దల వద్ద ప్రస్తావించి వచ్చారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ అదే పనిలో ఉన్నారు. వారికి చేదోడుగా ఇప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరిపోయారు. ఏపీ బీజేపీలో పురంద్రీశ్వరి, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి వంటి వారికే ప్రాధాన్యత లేదు. కన్నా వంటి వారే ఇమడలేక కమలాన్ని వదిలి పోయారు. ఇప్పుడు ఈయనకు ఏపీ బీజేపీలో పెద్దపీట వేస్తారన్న నమ్మకమూ లేదు. కాకుంటే ప్రొటోకాల్ ప్రకారం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరడం వల్ల కొంత అడ్వాంటేజీ ఉంటుంది. భవిష్యత్ తర్వాత. ముందు జగన్ను ఎదుర్కొనాలంటే బీజేపీలో చేరి కొంత చెక్ పెట్టాలన్నదే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయంగా చెబుతున్నారు. లాస్ట్ బాల్ కోసమే ఆయన పార్టీలో చేరినట్లు స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ పార్టీలో నల్లారి ఎన్నాళ్లు నడుస్తారన్నది చూడాల్సి ఉంది.
Next Story