Mon Dec 23 2024 08:20:38 GMT+0000 (Coordinated Universal Time)
పెద్దిరెడ్డి కోసం... నల్లారి నిర్ణయమిదే
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు తొమ్మిదేళ్ల నుంచి ప్రజలకు దూరంగా ఉంటున్న నల్లారి ఇక ఎన్నికలకు ముందు యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన కీలక భూమిక పోషించాలని భావిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రెండు మూడురోజుల్లో రాజీనామా చేయనున్నారని తెలిసింది. అనంతరం ఆయన బీజేపీలో చేరతారని సమాచారం. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో ఆయన టచ్ లోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ అధినాయకత్వం కూడా మాజీ ముఖ్యమంత్రి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
కొన్నాళ్లాగా మౌనంగా...
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. 2014లో జై సమైక్యాంధ్ర పార్టీని పెట్టారు. అయితే ఆ పార్టీ నుంచి ఎవరూ గెలవకపోవడంతో దానిని మూసివేశారు. ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. 2014 తర్వాత కొన్నాళ్లు మౌనంగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే యాక్టివ్ గా మాత్రం లేరు.
ఎదుర్కొనాలంటే...
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి, నల్లారి కుటుంబానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. దశాబ్దాలుగా ఇద్దరి మధ్య పొసగదు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నిలువరించడం సాధ్యం కావడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి హవా నడుస్తుంది. ఈ నేపథ్యంలో పెద్దరెడ్డిని దెబ్బకొట్టాలంటే తాను బీజేపీలో చేరక తప్పదని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే ఆయన బీజేపీలో చేరుతున్నారని తెలిసింది. రాష్ట్రంలో బీజేపీ బలంగా లేకపోయినా కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పెద్దిరెడ్డిని సమర్థవంతంగా ఢీకొట్టేందుకు బీజేపీలో చేరడమే మేలని నల్లారి భావిస్తున్నారు.
బీజేపీలోకి...
రెండు రోజుల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే అవకాశముంది. ఆ తర్వాత ఆయన ఢిల్లీలోని పెద్దల సమక్షంలో కమలం పార్టీ కండువా కప్పుకుంటారని తెలిసింది. కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న నల్లరి 2024లో కీరోల్ పోషించాలని భావిస్తున్నారు. ఆయన అప్పుడప్పుడూ చిత్తూరు జిల్లాలోని తన సొంత ప్రాంతంలో పర్యటించడం మినహా ఏపీకి కూడా పెద్దగా రావడం లేదు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని తెలిసింది. మొత్తం మీద పెద్దిరెడ్డిని కట్టడి చేయాలంటే తాను బీజేపీలో చేరడమే మేలని భావించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. మరి ముహూర్తం ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.
Next Story