Fri Nov 15 2024 06:59:57 GMT+0000 (Coordinated Universal Time)
సంక్రాంతికి దగ్గుబాటి సంచలన నిర్ణయం
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెల్లడించారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెల్లడించారు. రాజకీయాల నుంచి తనతో పాటు తన కుమారుడు హితేష్ కూడా తప్పుకుంటున్నారని తెలిపారు. బాపట్ల జిల్లా పర్చూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత రాజకీయాల్లో తాము మనలేమని ఆయన చెప్పుకొచ్చారు.మనసును చంపుకుని తాము నేటి రాజకీయాలు చేయలేకపోతున్నామని తెలిపారు. ఇటువంటి రాజకీయల్లో మనుగడ కూడా కొనసాగించలేమని తెలిపారు. అందుకే తనతో పాటు తన కుమారుడు హితేష్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని తెలిపారు. తన సతీమణి పురంద్రీశ్వరి మాత్రం రాజకీయాల్లో కొనసాగుతారని ఆయన తెలిపారు.
రిటైర్మెంట్ ప్రకటన...
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్నారు. తన కుమారుడు హితేశ్ ను రాజకీయాల్లోకి తేవాలని ఆయన మొన్నటి వరకూ భావించారు. కానీ తన భార్య బీజేపీలో క్రియాశీలకంగా ఉండటం, తాము వేరే పార్టీలో ఉండటం సరికాదని ఆయన భావించినట్లుంది. అందుకే ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా రిటైర్మెంట్ కావాలని నిర్ణయించుకున్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా పురంద్రీశ్వరి మాత్రం రాజకీయాల్లో కొనసాగుతారని చెబుతున్నారు.
కుమారుడిని కూడా...
పర్చూరు దగ్గుబాటి కుటుంబానికి కంచుకోట వంటిది. వాస్తవానికి ఆయన తెలుగుదేశం పార్టీకి తిరిగి దగ్గరై హితేశ్ ను పర్చూరు నుంచి తొలుత పోటీ చేయించాలని భావించారు. చంద్రబాబుతో సఖ్యతను కూడా కొనసాగిస్తున్నారు. కొంతకాలం క్రితం దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుండెసంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చేరితే చంద్రబాబు నాయుడు వెళ్లి స్వయంగా పలకరించి వచ్చారు. నందమూరి కుటుంబంలో జరిగిన ఒక వివాహ వేడుకల్లో కూడా ఇద్దరూ పాల్గొని మాట్లాడుకున్నారు. దీంతో హితేశ్ ను టీడీపీలోకి పంపి తాను మాత్రమే రాజకీయాల నుంచి రిటైర్ అవుతారని అనుకున్నారు.
పురంద్రీశ్వరి మాత్రమే...
కానీ ఉన్నట్లుండి తనతో పాటు తన కుమారుడు హితేశ్ కూడా ఇక రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించడం వెనక పురంద్రీశ్వరి రాజకీయ భవిష్యత్ కోసమేనంటున్నారు. ఆమె బీజేపీలో ఎదగాలన్నా, పదవులు దక్కాలన్నా వీరిద్దరూ రాజకీయంగా అడ్డంకిగా మారారంటున్నారు. కుటుంబంలో తలో పార్టీలో ఉంటున్నప్పుడు పురంద్రీశ్వరికి బీజేపీ అధినాయకత్వం కూడా పెద్దగా పట్టించుకోదని చెబుతున్నారు. అందుకే దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంక్రాంతి పండగ రోజున అనూహ్య నిర్ణయం తీసుకున్నారంటున్నారు. ఒక సీినియర్ నేత రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ప్రధానంగా ప్రకాశం జిల్లాకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోనూ ఆయన అభిమానులకు చేదువార్తగానే చెప్పుకోవాల్సి ఉంటుంది.
Next Story