Wed Dec 25 2024 22:35:36 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జంప్... వైసీపీలోకి
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, కైకలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి జయమంగళ వెంకట రమణ టీడీపీకి గుడ్ బై చెబుతున్నారు
తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, కైకలూరు నియోజకవర్గం ఇన్ఛార్జి జయమంగళ వెంకట రమణ టీడీపీకి గుడ్ బై చెబుతున్నారు. ఆయన వైసీపీలో చేరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాదని భావించిన జయమంగళ వెంకట రమణ పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. తాను ఆర్థికంగా ఇబ్బందుల్లోనని భావించిన టీడీపీ హైకమాండ్ టిక్కెట్ ఇచ్చే ఆలోచన లేదని ఆయన భావించారు. అందుకే ఆయన పార్టీ మారుతున్నారు. వైసీపీలో చేరడానికి ప్రధాన కారణం పార్టీలో చేరితే రానున్న కాలంలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న హామీని వైసీపీ హైకమాండ్ నుంచి లభించినట్లు తెలుస్తోంది.
నలుగురు గన్మెన్లను...
జయమంగళ వెంకటరమణకు ఇప్పటికే ప్రభుత్వం నలుగురు గన్మెన్లను కూడా కేటాయించింది. ఇప్పటికే ఆయన మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో భేటీ అయి తన రాజకీయ భవిష్యత్ పై చర్చించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయానికి కైకలూరు నుంచి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయమంగళ వెంకటరమణ ప్రస్తుతం కైకలూరు టీడీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన పార్టీ మారడానికి అనేక కారణాలున్నాయంటున్నారు.
టిక్కెట్ రాదని...
వచ్చే ఎన్నికల్లో జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం ఖాయమయిన నేపథ్యంలో టిక్కెట్ తనకు రాదని భావించిన జయమంగళ వెంకటరమణ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అనేక సార్లు టీడీపీ అధినేత నుంచి తన టిక్కెట్ పై క్లారిటీ కోసం ప్రయత్నించినప్పటికీ రాకపోవడంతో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో చేరితే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్న హామీతోనే ఆయన ఫ్యాన్ పార్టీ వైపు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 2009లో జయమంగళ వెంకటరమణ కైకలూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు.
Next Story