Tue Nov 05 2024 05:35:14 GMT+0000 (Coordinated Universal Time)
నలుగురిలో ఒకే ఒక్కడు
వైసీపీ నుంచి 4గురు ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని వేటు వేశారు
వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారని వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే నలుగురిలో ఒక్కరు మాత్రమే యాక్టివ్ గా ఉన్నారు. మిగిలిన వారు నియోజకవర్గాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఒక్కొక్కరికి ఒక్కో కారణం. కారణాలు ఏదైనా నియోజకకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు కూడా చేపట్టడం లేదు. కానీ నలుగురు సస్పెండ్‌కు గురైన ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఒక్కరే నియోజకవర్గంలో యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమవ్వడంతో అధికార పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలను చేపడుతున్నారు.
కోటంరెడ్డి మాత్రం...
నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాత్రం నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నారు. ఆయన ప్రజాసమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతానని చెబుతున్నారు. త్వరలో వంతెన నిర్మాణం కోరుతూ జలదీక్ష చేస్తున్నానని కోటంరెడ్డి ప్రకటించారు. ఇప్పటికే తన సోదరుడు కోటంరెడ్డి గిరధర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చేర్చిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాత్రం తాను వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. కార్యకర్తల సమావేశంలో కోటంరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయిన తర్వాతనే వైసీపీ అధినాయకత్వం రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నియమించింది.
ఆనం ఆలోచన...
ఇక ఆనం రామనారాయణరెడ్డిపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఆయన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. సస్పెన్షన్ వేటు వేసిన నాటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం. అదీ టీడీపీ నుంచే. అది కూడా కన్ఫర్మ్. అయితే వెంకటగిరి నుంచి కాకుండా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని ఆనం రామనారాయణరెడ్డి ఆలోచన. టీడీపీ అధినాయకత్వం కూడా ఆత్మకూరులో సరైన నాయకత్వం లేకపోవడంతో ఆనంకు అక్కడే అవకాశమివ్వనుంది. ఈ నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలో మాత్రం యాక్టివ్‌గా లేరు. త్వరలోనే ఆయన నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆయన మరికొన్ని డిమాండ్లను టీడీపీ హైకమాండ్ ముందు ఉంచి సాధించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనపడుతుంది.
మేకపాటి ఇక సైలెంటే...
ఇక మరో సస్పెండ్‌కు గురైన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం రాజకీయంగా దూరమయ్యేటట్లే కనిపిస్తుంది. తొలి రోజుల్లో ఉదయగిరిలో కొంత హల్చల్ చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తాను ఇండిపెండెంట్ తర్వాత సోదరుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి సూచన, హెచ్చరికతో ఒకింత మెత్తపడినట్లే కనిపిస్తుంది. ఆరోగ్యం కూడా తనకు సహకరించడం లేదని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేేస్తానో లేదో తెలియదని కూడా చెబుతున్నారు. వరసగా గుండె సంబంధిత జబ్బులు రావడంతో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా రాజకీయాలకు స్వస్తి చెప్పమని వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయన ఈ ఏడాది మాత్రమే ఎమ్మెల్యేగా కొంత హడావిడి చేసి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. ఈ విషయంపై ఆయన త్వరలో సన్నిహితులకు క్లారిటీ కూడా ఇస్తారని తెలిసింది. టీడీపీ కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు సముఖంగా లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పాలి.
శ్రీదేవికి మాత్రం దారి...
మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి టీడీపీ హైకమాండ్ నిర్ణయం కోసం ఎదురు చూడటం తప్ప మరో దారి లేదు. ఎందుకంటే ఆమెకు నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే వైసీపీ హైకమాండ్ ఆమెకు సీటు నో అని ముందుగానే చెప్పేసింది. తాడికొండ నియోజకవర్గం టిక్కెట్ టీడీపీ ఇచ్చే అవకాశం లేదు. టీడీపీ ఇప్పటికే పొత్తులు కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. జనసేన, బీజేపీ, కమ్యునిస్టులతో పొత్తులు కుదిరితే ఉండవల్లి శ్రీదేవికి ఎక్కడా టిక్కెట్ లభించే ఛాన్స్ లేదు. అలా కాకుండా ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తేనే ఎదైనా రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి శ్రీదేవికి చంద్రబాబు అవకాశమివ్వవచ్చు. లేదంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ హామీ ఇచ్చి ఆమె చేత కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయించుకోవచ్చు. అంతే తప్ప.. ఉండవల్లి శ్రీదేవికి రాజకీయంగా మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.
Next Story